మార్కెట్‌కు జీడీపీ జోష్!
క్యూ1లో వృద్ధి రేటుపుంజుకున్న ఎఫెక్ట్...
* సోమవారం బొగ్గు స్కామ్‌పై సుప్రీం తీర్పు
* క్యాడ్ గణాంకాల విడుదల కూడా
* ఆగస్ట్ నెలకు సంబంధించిన వాహన విక్రయ గణాంకాలు నేడు వెల్లడి
* ఈ అంశాలన్నింటిపైనా ఇన్వెస్టర్ల దృష్టి
* స్టాక్ నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లు సానుకూలంగా మొదలవుతాయని అత్యధిక శాతం మంది నిపుణులు విశ్లేషించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్, క్యూ1)కు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు ప్రోత్సాహకరంగా వెలువడటం ఇందుకు సహకరించనున్నట్లు తెలిపారు. గత శుక్రవారం(29న) ప్రభుత్వం జీడీపీ గణాంకాలు విడుదల చేయడం తెలిసిందే. మైనింగ్, సర్వీసెస్, తయారీ రంగాలు పుంజుకోవడంతో ఆర్థిక వ్యవస్థ 5.7% వృద్ధిని అందుకుంది. ఇది గత రెండున్నరేళ్లలో అత్యధికంకావడంతో మార్కెట్లు జోష్‌తో మొదలయ్యే అవకాశముందని స్టాక్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే సోమవారం(సెప్టెంబర్ 1) బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది.
1993 నుంచి 2010 వరకూ వివిధ ప్రభుత్వాలు చేపట్టిన కేటాయింపులన్నీ అక్రమమేనంటూ ఇప్పటికే సుప్రీం కోర్టు అభిప్రాయపడ్డ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, మంగళవారం(2న) 2జీ స్పెక్రమ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో వాదోపవాదనలకు తెరలేవనుంది.ఈ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తారని నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోపక్క కరెంట్ ఖాతాలోటు గణాంకాలు వెలువడనున్నాయి.
కాగా, క్యూ1లో నమోదైన 5.7% జీడీపీ వృద్ధి పూర్తి ఏడాదికి కూడా కొనసాగుతుందని ఆర్థిక శాఖ వేసిన అంచనాలు సెంటిమెంట్‌ను మెరుగుపరచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వారం మొదట్లో మార్కెట్లు సానుకూలంగా మొదలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఈ వారం ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయన్నారు. ఆగస్ట్ నెలకు సంబంధించిన వాహన విక్రయాల గణాంకాలు సోమవారం నుంచి వెల్లడికానున్నాయి.
విదేశీ సంకేతాలూ కీలకమే...
అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం ట్రెండ్‌కు కీలకంగా నిలుస్తాయని నిపుణులు వివరించారు. గురువారం జరగనున్న యూరోపియన్ కేంద్ర బ్యాంకు సమావేశంపైనా మార్కెట్ వర్గాలు కన్నేశాయని చెప్పారు. అదనపు సహాయక ప్యాకేజీ నిర్ణయంపై ఆసక్తి నెలకొందని తెలిపారు. అయితే జీడీపీ ఎఫెక్ట్ ద్వారా మార్కెట్లలో ట్రెండ్ నిర్దేశితమయ్యే చాన్స్ అధికంగా ఉందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు. గత వారం సెన్సెక్స్ 218 పాయింట్లు పుంజుకుని 26,638 వద్ద స్థిరపడ్డ విషయం విదితమే.
దేశీ స్టాక్స్‌పట్ల ఫండ్స్ ఆసక్తి
ఆగస్ట్‌లో మ్యూచువల్ ఫండ్స్ రూ. 6,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. ఇది గత ఆరున్నరేళ్ల కాలంలోనే అత్యధికంకావడం విశేషం. అంతేకాకుండా దీంతో వరుసగా 4వ నెలలోనూ ఫండ్స్ నికర కొనుగోలుదారులుగా నిలిచాయి. అయితే ఇదే కాలంలో రుణ సెక్యూరిటీలలో రూ. 66,000 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. జూలైలో రూ.5,000 కోట్లు, జూన్‌లో రూ. 3,340 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశాయి.
ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు
దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ప్రభుత్వ సంస్కరణలపై నమ్మకంతో ఎఫ్‌ఐఐలు ఇటు రుణ సెక్యూరిటీలు, అటు ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐల మొత్తం పెట్టుబడులు 30 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) చేరాయి. వీటిలో 17 బిలియన్ డాలర్లను(రూ. 1.02 లక్షల కోట్లు) రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్‌చేయగా, మరోపక్క 13 బిలియన్ డాలర్ల(రూ. 78,000 కోట్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఆగస్ట్ నెలలో ఎఫ్‌ఐఐలు 3.65 బిలియన్ డాలర్ల(సుమారు రూ.22,000 కోట్లు) విలువైన బాండ్లు, ఈక్విటీలను కొనుగోలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు తీసుకువస్తున్న ఆర్థిక సంస్కరణలు విదేశీ నిధుల ప్రవాహానికి దోహదపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.