ర్యాలీ కొనసాగేనా..? | Monday Holiday to Stock Market | Sakshi
Sakshi News home page

ర్యాలీ కొనసాగేనా..?

Published Mon, Sep 2 2019 10:49 AM | Last Updated on Mon, Sep 2 2019 11:55 AM

Monday Holiday to Stock Market - Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనానికి గడిచిన వారంలో అడ్డుకట్ట పడింది. అంతక్రితం రెండు వారాల వరుస నష్టాల నుంచి కోలుకుని, లాభాల బాట పట్టిన ప్రధాన సూచీలు.. దాదాపు 1.79 శాతం లాభపడి ఏకంగా మూడు నెలల గరిష్టస్థాయిని నమోదుచేశాయి. ఇక ఈవారంలో మార్కెట్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉందనుందనే అంశానికి.. స్థూల ఆర్థిక అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డేటా వెల్లడైన విషయం తెలిసిందే కాగా, దేశ ఆర్థికరంగ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందనే అంశానికి తాజా డేటా అద్దం పట్టింది.

జీడీపీ క్షీణతను మార్కెట్‌ వర్గాలు అంచనావేసినప్పటికీ.. మరీ ఈ స్థాయిలో తగ్గుదల ఉంటుందని మాత్రం అంచనావేయలేదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయకుమార్‌ అన్నారు. అయితే, లోబేస్‌ ప్రయోజనం ఉన్నందున ద్వితీయార్థంలోని రెండు త్రైమాసికాల్లోని వృద్ధిరేటు ఊపందుకుంటుందని విశ్లేషించారు. ‘ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో కోత విధించేందుకు అవకాశం ఉంది. వచ్చే 2–3 త్రైమాసికాల్లో ఆర్‌బీఐ నిర్ణయాలు పటిష్టంగా ఉండనున్నాయని భావిస్తున్నాం. వృద్ధి రేటు గాడిన పడాలంటే.. కార్మిక, భూ సంస్కరణల మాదిరిగానే ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉంది’ అని విశ్లేషించారాయన. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈవారం ట్రేడింగ్‌ అంతంత మాత్రంగానే ఉండేందుకు అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అన్నారు.  

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే..
వినాయక చవితి సందర్భంగా సోమవారం (2న) దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. మంగళవారం (3న) ఉదయం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభంకానుంది. లేబర్‌ హాలిడే కారణంగా సోమవారం అమెరికా మార్కెట్‌కు సెలవు.

బ్యాంకింగ్‌ షేర్లు ఆదుకునేనా..?
మొండి బకాయిల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోన్న బ్యాంకింగ్‌ రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సంస్కరణలను చేపట్టింది.  శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత ఏకంగా 10 బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా పరంగా చేపట్టిన తాజా సంస్కరణలు.. మార్కెట్‌కు సానుకూలంగా మారనున్నాయని జియోజిత్‌ ఆర్థిక నిపుణులు దీప్తి మాథ్యూస్‌ విశ్లేషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement