మారుతీ వడ్డింపు రూ.34,494 వరకూ
మౌలిక సెస్ విధింపు ఫలితం
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల ధరలను రూ.34,494 వరకూ పెంచింది. 2016-17 బడ్జెట్‌లో వాహనాలపై మౌలిక సెస్‌ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించడంతో వాహన కంపెనీలు ఆ మేరకు ధరలను పెంచుతున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ తన అన్ని మోడళ్లపై ధరలను రూ.1,441 నుంచి రూ.34,494 వరకూ పెంచుతోంది. సియాజ్ ఎస్‌హెచ్‌వీఎస్, ఎర్టిగ ఎస్‌హెచ్‌వీఎస్ మోడళ్లపై మౌలిక సెస్ లేనందున ఈ కార్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. మారుతీ సుజుకీ కంపెనీ రూ.2.54 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.11.69 లక్షల ధర ఉన్న ప్రీమియం క్రాసోవర్ ఎస్-క్రాస్ వరకూ వివిధ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కాగా వాహనాలపై మౌలిక సెస్ విధింపు కారణంగా ఇప్పటికే మెర్సిడెస్-బెంజ్ తన కార్ల ధరలను రూ.5 లక్షల వరకూ పెంచింది. ఇక టాటా మోటార్స్ రూ.2,000 నుంచి రూ.35,000 వరకూ, హ్యుందాయ్ ఇండియా, హోండా కార్స్ కంపెనీలు రూ.3,000 నుంచి రూ.80,000 వరకూ పెంచుతున్నట్లు ప్రకటించాయి.