Ertiga
-
మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్ వేరియంట్ రూ.18,600, సీఎన్జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను ఈ కారుకు పొందుపరిచారు. సీఎన్జీ వేరియంట్లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్‌తో అత్యాధునిక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్.. ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలాఖరులో ఎక్స్ఎల్6 కొత్త వర్షన్ రానుందని ఆయన చెప్పారు. -
మారుతి సుజుకి కస్టమర్లకు హెచ్చరిక!
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 1,80,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. భారతీయ ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ రీకాల్ చేయలేదు. ఫ్యూయెల్ పంప్లో లోపాలు ఉండటంతో పలు మోడళ్లను రీకాల్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. మే 4, 2018 నుంచి అక్టోబర్ 27, 2020 మధ్య తయారు చేసిన సీయాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎక్స్ ఎల్6ల పెట్రోల్ వేరియెంట్లను రీకాల్ చేస్తుంది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. "వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా, మారుతి సుజుకి మోటార్ జనరేటర్ యూనిట్ తనిఖీ/భర్తీ కోసం వాహనాలను ఉచితంగా స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని నిర్ణయించింది. లోపం ఉన్న వాహన యజమానులకు మారుతి సుజుకి అధికరులు కాల్ చేస్తారని" కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. అప్పటి వరకు వినియోగదారులు నీటితో నిండిన ప్రాంతాల గుండా వెళ్లకూడదు అని, వాహనాల ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల పైన వాటర్ స్ప్రే చేయకూడదని కోరింది.(చదవండి: 3 మిలియన్ల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్!) అలాగే, 2018 నుంచి 2020 మధ్య కాలంలో కొనుగోలు చేసిన వాహనదారులు తమ ఈ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని కోరింది. కస్టమర్లు తమ వాహనం ఈ జాబితాలో ఉందో చెక్ చేసుకోవడానికి www.marutisuzuki.com(ఎర్టిగా, విటారా బ్రెజ్జా కోసం), www.nexaexperience.com(సీయాజ్, ఎక్స్ ఎల్6, ఎస్-క్రాస్ కోసం) పోర్టల్ లోని IMP. CUSTOMER INFO లింకు మీద క్లిక్ చేసి వేహికల్ ఛాసిస్ నెంబరు (ఎమ్ఎ3 తర్వాత గల 14 అంకెల ఆల్ఫా-న్యూమరిక్ నెంబరు) నమోదు చేయాల్సి ఉంటుంది. -
కార్ల ధరలు పెంచిన మారుతి.. ఏ మోడళ్లపై అంటే?
ఢిల్లీ: వినియోగదారులకు మారుతి ఆటో షాక్ ఇచ్చింది. మారుతిలో మోస్ట్ పాపులర్ మోడల్ స్విఫ్ట్‌తో పాటు ఇతర వేరియంట్లకు ధరలను అమాంతం పెంచేసింది. కారు తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మారుతి ప్రకటించింది. రూ. 15,000 మారుతి కార్ల ధరలు పెంచుతామంటూ 2021 జూన్ 21న ఇప్పటికే ప్రకటించామని, దానికి తగ్గట్టుగా స్విప్ట్ మోడల్‌తో పాటు అన్ని సీఎన్జీ వేరియంట్ల కార్ల ధరలు పెంచుతున్నామని మారుతి ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం కనీసం రూ.15,000 ధర పెంచామని వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మోడళ్లపై ప్రస్తుతం మారూతిలో స్విఫ్ట్ డిజైర్ టూర్‌తో పాటు ఎర్టిగా, వ్యాగన్ ఆర్, ఆల్టో, సెలేరియో, ఎస్ప్రెస్సో, ఏకో మోడళ్లలో సీఎన్జీ కార్లు లభిస్తున్నాయి. మొత్తంగా మారుతిలో ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్స్‌పై ధరలు పెరిగాయి. ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే స్టాక్మార్కెట్లో మారూతి షేర్ల ధరలు కూడా పెరిగాయి. -
మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!
సాక్షి, ముంబై : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి హ్యుందాయ్ షాకిచ్చింది. హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలచింది. దీంతో ఇప్పటిదాకా ఈ జాబితాలో టాప్ లో నిలిచిన మారుతిని వెనక్కి నెట్టివేసింది. 2020 మేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా స్థానాన్ని దక్కించుకుంది. (వాహన అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే..) హ్యుందాయ్ కొత్తగా ప్రారంభించిన క్రెటా 2020, మే నెలలో 3212 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. కాగా మారుతి సుజుకి ఎర్టిగా (ఎంపీవీ) రెండవ స్థానంలో నిలిచింది. అయితే అమ్మకాల పరంగా ఆల్టో, డిజైర్ , స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోలిస్తే ఎర్టిగా ఎక్కువ ఆదరణను నోచుకుంది. (మారుతి కూడా : బై నౌ.. పే లేటర్) కాగా కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ అమ్మకాలు పూర్తిగా పడిపోయి కుదేలైన సంగతి తెలిసిందే. సడలించిన నిబంధనలతో తిరిగి కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ విక్రయాలు ఇంకా వేగం పుంజుకోలేదు. ఈ క్రమంలోనే మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల 1,25,552 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే గత నెలలో 13,888 యూనిట్లను మాత్రమే విక్రయించింది. -
పెద్ద మొత్తంలో మారుతి కార్ల రీకాల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ వినియోగదారులకు షాకిచ్చిందింది. తన వాహనాల్లో కొన్ని మోడళ్ల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 'పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్' వేరియంట్ల కార్లలోని మోటారు జనరేటర్ యూనిట్లలో సమస్య కారణంగా వేలాది వాహనాలను రీకాల్ చేస్తోంది. 63,493 మారుతి సుజుకి సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 కార్లును వెనక్కి తీసుకుంటోంది. జనవరి1నవంబర్ 21మధ్య తయారైన సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 మోడళ్ల స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లను పరిశీలిస్తామని భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థమారుతి తెలిపింది. ఈ మేరకు మారుతి సుజుకి మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారు చేయడం వలన ఎంజీయూలో లోపం ఏర్పడి వుండవచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆయా వాహనదారులు ఈ రోజునుంచే మారుతి సుజుకి డీలర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ఆయా వాహనాలను తనిఖీ చేయించు కోవడంతోపాటు లోపభూయిష్టమైన పార్ట్‌లను ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తమ రీకాల్‌కు సంబంధించిన ప్రచారాన్ని చేపట్టినట్టు మారుతి తెలిపింది. -
‘మారుతి ఎర్టిగా’ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఇండియా తాజాగా ‘ఎర్టిగా’ మోడల్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ అందుబాటులో ఉండగా... ఇంజిన్ సామర్థ్యాన్ని మరింత పెంచి ఈ వేరియంట్‌ను విడుదల చేశారు. ఈ నూతన కారు ధరల శ్రేణి రూ.9.86 లక్షల నుంచి రూ.11.20 లక్షలు. ప్రతి లీటరుకు 24.20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్ల అవసరాలను విశ్లేషించి ఈ తదుపరి తరం ఎర్టిగాను విడుదలచేసినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు. గతేడాది నవంబర్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో ఈ మోడల్ అమ్మకాలు 40,000 యూనిట్లుగా కంపెనీ వెల్లడించింది. -
మారుతి ఎర్టిగా సరికొత్తగా
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎర్టిగా కారును విడుదల చేసింది. 1.5 లీటర్ డీడీఐఎస్ 225 డీజిల్ ఇంజిన్‌తో అప్డేట్ చేసి లాంచ్ చేసింది. వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్ మూడు వేరియంట్లలో ఈ కారును విక్రయిస్తోంది. వీటి ప్రారంభ ధర (న్యూఢిల్లీ ఎక్స్‌షోరూమ్) రూ.9.86లక్షలు. అత్యధిక ధర రూ.11.20 లక్షలు. పాత 1.3లీటర్ డీడీఐఎస్ 200 ఇంజిన్ స్థానంలో సరికొత్త 1.5 లీటర్ డీడీఐఎస్ 225 పెట్రోల్ ఇంజిన్ ను అమర్చింది. డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ టెక్నాలజీ, 1498 సీసీ ఫోర్ సిలిండర్‌తో వస్తున్న ఈ కొత్త ఎర్టిగా 4000 ఆర్పీఎం వద్ద 94 బీహెచ్పీ శక్తి, 1500-2500 ఆర్పీఎం వద్ద 225ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. అవసరమైతే 1.5 లీటర్ డీజిల్ ఇంజీన్‌ను బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామని మారుతీ ఛైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. కాగా ఎర్టిగా ఎంపీవీ సెగ్మెంట్లో అత్యధికంగా విక్రయించే వాహనంగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
మారుతి ఎర్టిగా బుకింగ్స్ నేటి నుంచే
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఎర్టిగాను న్యూ అవతార్‌లో లాంచ్ చేయనుంది. సెవన్ సీటర్ మల్టీ పర్సస్ వెహికల్ (ఎంపీవీ) కొత్త ఎర్టిగా 2018ను నవంబరు 21ల లాంచ్ చేయనున్నామని మారుతి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ న్యూ ఎర్టిగా ఎల్, వీ, జెడ్, జెడ్ + అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో ఈనెల 21న లాంచ్ చేయనుంది. అలాగే ఈ వాహనాల ప్రీ బుకింగ్స్‌ను నేటి (నవంబరు 14, బుధవారం) నుంచి ప్రారంభించింది. కేవలం రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే లాంచింగ్ సందర్భంగా మారుతి వెల్లడించనుంది. అయితే పాత మోడల్ ఎర్టిగాతో పోలిస్తే కొత్త ఎర్టిగా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. రూ 6.34- 10.69 లక్షలు (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎర్టిగా 2018 ( ఎంపీవీ) 1.5 లీటర్ పెట్రోలు ఇంజీన్, 1.3 లీటర్ డీజిల్ రెండు వెర్షన్లలో, అయిదు రంగుల్లో లభ్యంకానుంది. -
మారుతీ సుజుకీ కార్లపై రూ.70వేల డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలో తన మోడల్స్‌పై రూ.70వేల వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్ అందించే మోడల్స్‌లో స్విఫ్ట్, ఎర్టిగా, డిజైర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ చేసే కారు, ఏడేళ్ల కంటే తక్కువ వయసున్నది అవ్వాలి. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ సర్వీసున్న కార్లకు తక్కువ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. కారు అసలు విలువ నుంచి రూ.35 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎర్టిగా.. మారుతీ సుజుకీ ప్రకటించిన ఆఫర్ కింద, ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ రూ.15వేల నగదు డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్‌పై రూ.20వేల డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా సీఎన్జీ ట్రిమ్‌పై రూ.10వేల డిస్కౌంట్ లభిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.30వేలు, రూ.20వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కారు వాడిన ఏళ్ల ప్రకారం ఉంటుంది. డీజిల్ వేరియంట్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు రూ.35వేలు, రూ.25వేలుగా ఉన్నాయి. డిజైర్... మారుతీ సుజుకీ డిజైర్(పెట్రోల్) రెగ్యులర్ ఎడిషన్‌పై రూ.20వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. స్పెషల్ ఎడిషన్‌పై రూ.27వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఉంది. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ వయసున్న కారు అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10వేలకు తగ్గుతుంది. మారుతీ సుజుకి డిజైర్ డీజిల్ వేరియంట్‌పై రూ.10వేల నగదు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఆఫర్ చేస్తుంది. స్విఫ్ట్... మారుతీ సుజుకీ స్విఫ్ట్ రెగ్యులర్ పెట్రోల్ ట్రిమ్ వేరియంట్‌పై రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌పై రూ.27వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు, ఒకవేళ కారు ఏడేళ్ల కంటే ఎక్కువ వాడి ఉంటే, డిస్కౌంట్ రూ.10వేలు తగ్గిపోతుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్(డీజిల్)పై రూ.10వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు రూ.25వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో/ఆల్టో కే10... ఆల్టో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.25వేల నగదు డిస్కౌంట్లను మారుతీ సుజుకీ ఆఫర్ చేస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 పెట్రోల్ ఎంటీపై రూ.22వేల నగదు డిస్కౌంట్ లభ్యమవుతుంది. ఆల్టో కే10 ఏఎంటీపై రూ.27వేల నగదు డిస్కౌంట్‌ను, అన్ని మోడల్స్‌పై రూ.30వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. -
మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి తన పాపులర్ వెహికల్లో లిమిటెడ్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగాను లిస్ట్ చేసింది. పెట్రోల్ వెర్షన్ రూ. 7.8 లక్షలు, స్మార్ట్‌హైబ్రిడ్ వెర్షన్ ధర 9.51 లక్షల(ఎక్స్ షోరూం, ఢిల్లీ) మధ్య ఉండనుంది. పాపులర్ మల్టీ పర్సస్ వెహికల్ (ఎమ్‌పీవీ) ఎర్టిగాను ‘టుగెదర్‌నెస్ ఈజ్ ద న్యూ స్టయిల్’ అనే ట్యాగ్ లైన్‌తో సరికొత్తగా పరిచయం చేసింది. సాంకేతికంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించింది. మారుతి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. అదనంగా పెట్రోల్ మోడల్‌ను 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. ఈ వేరియంట్ ఇంటీరియర్‌లో డోర్ ట్రిమ్స్, లెథర్ సీట్లు, స్టీరింగ్ వీల్ కవర్, డ్యాష్‌బోర్డ్ మీద ఫాక్స్ వుడ్ డిజైన్‌ను జోడించింది. ఇంకా ఫాగ్ ల్యాంప్స్, క్రోమ్ బెజెల్ హౌసింగ్స్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ సైడ్ మౌల్డింగ్స్, రూఫ్ రెయిల్స్, వెనుక వైపున లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి. సిల్కీ సిల్వర్, సూపీరియర్ వైట్, మెరూన్ మూడు విభిన్న రంగుల్లో ఈ వెహికల్ అందుబాటులోకి రానుంది. మారుతి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్ల విషయానికే వస్తే..1.4-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ మల్టీ జెట్ టర్బోఛార్జ్డ్ డీజల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. పెట్రోల్ ఇంజన్ 90బిహెచ్పి పవర్-130ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, డీజల్ ఇంజన్ 89బిహెచ్పి పవర్ - 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. మరోవైపు సెకండ్ జనరేషన్ ఎర్టిగాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొత్త పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ నాలుగు సిలిండర్లతో అవుట్ గోయింగ్ మోడల్ కన్నా పెద్దదిగా భారత్‌లో ఈ ఏడాది దీపావళి నాటికి తీసుకురానుందట. -
మారుతీ వడ్డింపు రూ.34,494 వరకూ
మౌలిక సెస్ విధింపు ఫలితం న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల ధరలను రూ.34,494 వరకూ పెంచింది. 2016-17 బడ్జెట్లో వాహనాలపై మౌలిక సెస్‌ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించడంతో వాహన కంపెనీలు ఆ మేరకు ధరలను పెంచుతున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ తన అన్ని మోడళ్లపై ధరలను రూ.1,441 నుంచి రూ.34,494 వరకూ పెంచుతోంది. సియాజ్ ఎస్హెచ్వీఎస్, ఎర్టిగ ఎస్హెచ్వీఎస్ మోడళ్లపై మౌలిక సెస్ లేనందున ఈ కార్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. మారుతీ సుజుకీ కంపెనీ రూ.2.54 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.11.69 లక్షల ధర ఉన్న ప్రీమియం క్రాసోవర్ ఎస్-క్రాస్ వరకూ వివిధ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కాగా వాహనాలపై మౌలిక సెస్ విధింపు కారణంగా ఇప్పటికే మెర్సిడెస్-బెంజ్ తన కార్ల ధరలను రూ.5 లక్షల వరకూ పెంచింది. ఇక టాటా మోటార్స్ రూ.2,000 నుంచి రూ.35,000 వరకూ, హ్యుందాయ్ ఇండియా, హోండా కార్స్ కంపెనీలు రూ.3,000 నుంచి రూ.80,000 వరకూ పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
1492 యూనిట్లకు మారుతి రీకాల్
దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకి 1492 యూనిట్ల మారుతి ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, ఏ స్టార్ మోడల్స్ ను రీకాల్ చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. స్టీరింగ్ కాలమ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకున్న మారుతి ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, ఏ స్టార్ మోడల్స్ యూనిట్లలో మళ్లీ ఉత్పత్తి చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 1492 వాహనాల్లో తలెత్తిన సమస్యను క్షుణ్టంగా కంపెనీ పరిశీలిస్తోందన్నారు. ఎర్టిగా 306 యూనిట్లు, స్విఫ్ట్ 592, డిజైర్ 581, ఏ స్టార్ 13 యూనిట్లను 2013 అక్టోబర్ 19 నుంచి 26 అక్టోబర్ వరకు ఉత్పత్తి చేసింది. 1492 వాహనాల్లో స్టీరింగ్ కాలమ్స్ లో తలెత్తిన సమస్యలకు కంపెనీ ఉచితంగా సేవలందింస్తుందని సంస్థ కు చెందిన నిర్వాహకులు తెలిపారు. కొత్త గా తయారు చేసిన స్టీరింగ్ కాలమ్స్ ను డీలర్ వర్క్ షాప్ లకు పంపామని మారుతి సంస్థ తెలిపింది. 2010 ఫిబ్రవరిలో కూడా 'ఏ స్టార్' కారులో ఫ్యూయల్ పంప్ పార్ట్ లో సమస్యలు తలెత్తడంతో పెద్ద ఎత్తున రీకాల్ చేసింది. కార్ల ఉత్పత్తిలో వినియోగదారుల ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటే వాలంటరీ రీకాల్ చేయాలని గత జూలైలో ఆటో మోబైల్ కంపెనీల చెందిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చర్స్ సూచించించి. దాంతో మూడు లక్షలకు పైగా కార్లను కంపెనీలు రీకాల్ చేశాయి. ఇంజన్ లో సమస్యలు తలెత్తడంతో సెయిల్ మోడల్ కు చెందిన నాలుగు వేల డీజీల్ వేరియెంట్ కార్లను గతంలో మారుతి రీకాల్ చేసింది.