మారుతీ కార్ల రేట్లు పెరిగాయ్..
రూ.1,500–రూ.8,014 వరకూ పెంపు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కార్ల ధరలు పెరిగాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 రూ.8,014 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)వరకూ పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కమోడిటీ, రవాణా, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.2.45 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.12.03 లక్షలు ధర ఉన్న ఎస్–క్రాస్ మోడల్ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది.
గత ఏడాది ఆగస్టులో ఈ కంపెనీ కొన్ని రకాల మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.5,000 రేంజ్‌లో పెంచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజా ధరను రూ.20,000, ప్రీమియమ్ హ్యాచ్‌బాక్ బాలెనో ధరను రూ.10,000 చొప్పున పెంచింది. గత ఏడాది పలు వాహన కంపెనీలు–హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, టయోటా, రెనో, మెర్సిడెస్–బెంజ్ ఇండియా, టాటా మోటార్స్‌లు తమ కార్ల ధరలను పెంచాయి.