న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. వరుసగా పదో నెలలోనూ కార్ల విక్రయాలు క్షీణతను నమోదుచేశాయి. ఈ విభాగంలోనే మార్కెట్ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) జూన్ దేశీ అమ్మకాలు ఏకంగా 15.3% తగ్గిపోయాయి. కంపెనీ మినీ సెగ్మెంట్ 36.2% క్షీణించింది. వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడిన నేపథ్యంలో దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతూనే ఉందని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, రుతుపవనాలపై అనిశ్చితి, అధిక వడ్డీ, ద్రవ్య లభ్యత సమస్య, బీఎస్–సిక్స్ అమలు వంటి ప్రతికూల అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపర్చాయన్నారు. మొత్తం ఆటో ఇండస్ట్రీ కంటే పీవీ అమ్మకాల పరంగా సెంటిమెంట్ మరింత బలహీనంగా ఉందని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వాధేరా అన్నారు. పరిశ్రమ ఇప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగుతుండగా.. మార్కెట్ మాత్రం త్వరలోనే కోలుకోవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment