ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్ | MCA notifies rules for ten more chapters in new Companies Act | Sakshi
Sakshi News home page

ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్

Published Sat, Mar 29 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్

ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్

 న్యూఢిల్లీ: కొత్త కంపెనీల చట్టం-2013లోని మరో 10 చాప్టర్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ బోర్డులో డెరైక్టర్ల నియామకం, వాళ్లకుండే అధికారాలు-అర్హతలు, బోర్డు సమావేశాలు, డివిడెండ్‌ల ప్రకటన-చెల్లింపు ఇతరత్రా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆరు దశాబ్దాలనాటి పాత చట్టం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త కంపెనీల చట్టం అమల్లోకి రానుంది. కంపెనీల ఏర్పాటు, సెక్యూరిటీల కేటాయింపు, వాటా మూలధనం, డిబెంచర్లు వంటివాటికి సంబంధించిన చాప్టర్లు కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ నోటిఫై చేసిన చాప్టర్లలో ఉన్నాయి.

 కాగా, 180కి పైగా సెక్షన్లకు సంబంధించి ఇటీవలే ఉత్తర్వులు వెలువడగా, మొత్తం షెడ్యూళ్లన్నింటినీ ఇప్పటికే నోటిఫై చేయడం తెలిసిందే. ఈ కొత్త చట్టంలో మొత్తం 29 చాప్టర్లు, 7 షెడ్యూళ్లు, 470 సెక్షన్లు ఉన్నాయి. మిగతా నిబంధనలను ఎప్పటికల్లా నోటిఫై చేస్తారు, వాటికి కంపెనీలు పాటించేందుకు ఏదైనా అదనపు గడువు ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉందని కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ ఇండియా ఎల్‌ఎల్‌పీకి చెందిన యోగేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది ఆగస్టులో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదముద్ర పడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో కొత్త కంపెనీల చట్టానికి సబంధించిన ఉత్తర్వుల జారీకి ఈ నెల 20న ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది.

 కంపెనీ బోర్డుల్లో మహిళా వాణి...
 కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం ఇకపై చాలావరకూ కంపెనీలు తమ డెరైక్టర్ల బోర్డులో కనీసం ఒక మహిళకు స్థానం కల్పించాల్సిందే. అదేవిధంగా ఇద్దరు స్వతంత్ర డెరైక్టర్ల నియామకం కూడా తప్పనిసరి. లిస్టెడ్ కంపెనీల్లో చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా తమతరఫున ఒక డెరైక్టర్ కోసం డిమాండ్ చేస్తే నియమించాల్సి వస్తుంది కూడా. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడ్‌అప్ షేర్ క్యాపిటల్ ఉన్న లిస్టెడ్, పబ్లిక్ సంస్థలన్నీ కూడా ఒక మహిళా డెరైక్టర్‌ను నియమించుకోవాలని కొత్త నిబంధనలు నిర్ధేశిస్తున్నాయి.  కాగా, చిన్న షేర్ హోల్డర్ల తరఫున డెరైక్టర్‌ను నియమించాలంటే కనీసం 1,000 మంది లేదా మొత్తం చిన్న వాటాదార్లలో పదింట ఒకటో వంతు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement