మైనస్ 294 నుంచి ప్లస్ 172కు సెన్సెక్స్
♦ రెండు రోజుల నష్టాలకు బ్రేక్
♦ రిలయన్స్, ఇన్ఫోసిస్‌ల్లో కొనుగోళ్ల జోరు
♦ 172 పాయింట్ల లాభంతో 24,854కు సెన్సెక్స్
♦ 52 పాయింట్ల లాభంతో 7,562కు నిఫ్టీ
ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు టీసీఎస్ ఆర్థిక ఫలితాలు నిరాశపరిచినా బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో చివరిగంటలో కొనుగోళ్ల జోరుతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. 19 నెలల కనిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్ కోలుకోగా, నిఫ్టీ కీలకమైన 7,500 పాయింట్లను అధిగమించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 172 పాయింట్లు లాభపడి 24,854 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 7,562 పాయింట్ల వద్ద ముగిశాయి.
569 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్
నవంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోవడం, డిసెంబర్ ద్రవ్యోల్బణం 5.61 శాతానికి పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపించినా, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్పోసిస్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. దీంతో స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
చైనా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెలువడిన తాజా గణాంకాలు ఆశావహంగా ఉండటంతో 294 పాయింట్ల నష్టంలో ఉన్న సెన్సెక్స్ లాభాల బాట పట్టింది. కమోడిటీ, ఇంధన షేర్లలో రికవరీ కారణంగా వరుసగా రెండో రోజూ యూరోప్ మార్కెట్లు లాభాల్లో సాగడం, షార్ట్ కవరింగ్ జరగడం.. సానుకూల ప్రభావం చూపించాయి. 24,957-24,388 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు 172 పాయింట్ల లాభంతో 24,854 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద 569 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.