
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సన్‌ప్యూర్ పేరుతో వంట నూనెల తయారీలో ఉన్న కర్ణాటక కంపెనీ ఎంకే అగ్రోటెక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. రైస్ బ్రాన్ ఆయిల్, పామాయిల్, గోధుమ పిండి, షుగర్ తదితర ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది.
కర్నాటకలో నెలకు 18,000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను విక్రయిస్తూ వ్యవస్థీకృతంగా 70% వాటాతో తొలిస్థానంలో ఉన్నట్టు ఎంకే అగ్రోటెక్ నేషనల్ సేల్స్ మేనేజర్ మల్లికార్జున్ పేరి తెలిపారు. ఆర్‌ఎస్‌ఎం మృత్యుంజయ నాయుడుతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘సోడియం హైడ్రాక్సైడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ వాడకుండా సన్‌ప్యూర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దేశంలో తొలిసారిగా సేంద్రియ మాధ్యమంలో తయారైంది. ఈ ఉత్పాదనకు పేటెంటు ఉంది’ అని చెప్పారు.
రెండేళ్లలో మూడు ప్లాంట్లు..: శ్రీరంగపట్నం వద్ద కంపెనీకి రోజుకు 450 టన్నుల సామర్థ్యం గల నూనె శుద్ధి కర్మాగారం ఉంది. బెంగళూరులో రూ.400 కోట్లతో రోజుకు 750 టన్నుల సామర్థ్యంతో నెలకొల్పుతున్న ప్లాంటు రెండు నెలల్లో సిద్ధం కానుంది. కాకినాడ వద్ద రూ.250 కోట్లతో రిఫైనరీని స్థాపించనుంది.
రోజుకు 700 టన్నుల సామర్థ్యంతో 18–24 నెలల్లో ఇది రానుంది. మహారాష్ట్రలో సైతం యూనిట్ ఏర్పాటు చేస్తామని మల్లికార్జున్ వెల్లడించారు. ఆహార ఉత్పత్తుల తయారీలో దేశంలో ప్రముఖ స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యమన్నారు. 1995లో శ్రీరంగపట్నం కేంద్రంగా ఎంకే అగ్రోటెక్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. 1,300 మంది ఉద్యోగులు ఉన్నారు.