విమాన టికెట్ల రద్దు నిబంధనల మార్పు?
♦ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది: మంత్రి అశోక గజపతి
♦ వృత్తి నైపుణ్యాల శిక్షణ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విమాన టికెట్ రద్దు, బ్యాగేజ్, బోర్డింగ్ వంటి అంశాల్లో కొత్త నిబంధనలు తేవాలని చూస్తోంది. టికెట్ రద్దు ఛార్జీలను ఈ మధ్య పలు విమానయాన సంస్థలు ఇష్టానుసారం పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ‘‘విమాన టికెట్ రద్దుకు సంబంధించి మాకు సలహాలు, సూచనలు, విన్నపాలు అందాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త నిబంధనలు తెస్తాం’’ అని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏవియేషన్ రంగంలో వృత్తి నైపుణ్యాల శిక్షణ నిమిత్తం.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), నేషనల్ స్కిల్ డె వలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎన్‌ఎస్‌డీఎఫ్) మధ్య ఈ సందర్భంగా ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఇందులో భాగంగా ఏఏఐ తన సీఎస్‌ఆర్ నిధులలో రూ.5.25 కోట్లను ఎన్‌ఎస్‌డీఎఫ్‌కు అందిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా ఇస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ శాఖ కార్యదర్శి రోహిత్ నందన్ మాట్లాడుతూ.. వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి ప్రతి మంత్రిత్వ శాఖ కూడా కొన్ని ప్రణాళికలతో ముందుకు రావాలని తెలిపారు.
భారత విమానయాన రంగంలో అత్యధికంగా 22 శాతం వృద్ధి నమోదయిందని, ప్రపంచంలోని ఏ ఇతర దేశమూ ఈ స్థాయి వృద్ధిని చూడలేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనమే ఈ వృద్ధికి కారణమై ఉండొచ్చన్నారు.