న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఏడాదీ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ మంగళవారం పేర్కొంది. దేశం 2019లో వృద్ధి బాటనే పయనించినా, ఆర్థికంగా కొంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనక తప్పదని విశ్లేషించింది.
కఠిన ఆర్థిక ద్రవ్య విధానాల బాటన దేశం కొనసాగుతుందని పేర్కొన్న మూడీస్, రాజకీయ ఇబ్బదులు, ఆర్థిక, ద్రవ్య సంస్కరణలపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ‘2018–19 ఆర్థిక సంవత్సరం– అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి’పై విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
♦ భారత్, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాలకు దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు ఉన్నాయి. అయితే సమీప భవిష్యత్తులో భారత్, ఇండోనేషియాలు వృద్ధి బాటనే కొనసాగుతాయి. ఇక భారత్, ఇండోనేషియా, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాల్లో వడ్డీరేట్ల పెంపు విధానాలు కొనసాగుతాయి.
♦ క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ, 2018, 2019ల్లో భారత ఆర్థిక వృద్ధి దాదాపు 7.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. జనవరి–మార్చి త్రైమాసికంలో 7.7 శాతం వృద్ధి సాధించిన భారత్ ఆర్థిక వ్యవస్థ, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రెండేళ్ల గరిష్టస్థాయి 8.2 శాతం స్థాయిని చూసింది.
♦ 2019లో ‘గ్లోబల్ సావరిన్ క్రెడిట్‌వర్తీనెస్’ అవుట్‌లుక్ ‘స్థిరం’గా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దేశీయ పరిస్థితులు బాగుండకపోవడం, బౌగోళిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వృద్ధి కొనసాగుతున్న ప్రయోజనం వల్ల ‘సమతౌల్యత’ పాటిస్తూ, ‘స్థిర’ అవుట్‌లుక్ ఇవ్వడం జరిగింది.
♦ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి ఉంది. అలాగే వృద్ధి మందగమనంలోనే కొనసాగే వీలుంది.
♦ జీ–20 దేశాల వృద్ధి 2018లో 3.3 శాతం ఉంటే, 2019లో 2.9 శాతంగానే నమోదవచ్చు. ఈ దేశాల్లో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి ఇదే కాలంలో 5 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గుతుంది.
♦ అధిక రుణం, వృద్ధి తగ్గడం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితులకు ఇబ్బందులు సృష్టిస్తాయి. అమెరికా వాణిజ్య రక్షణవాదం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం.
Comments
Please login to add a commentAdd a comment