జోరుగా డిజిటల్ ప్రచారం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇంటర్నెట్ ఎనేబుల్డ్ డివైస్‌ల్లో ప్రకటనలు జోరుగా పెరుగుతున్నాయి. ఈ డిజిటల్ ప్రచార వ్యయం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 15 శాతం వృద్ధితో 13,753 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఈమార్కెటీర్ అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనం పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..
2012లో మొత్తం ప్రచార వ్యయంలో ఐదవ వంతుగా ఉన్న డిజిటల్ ప్రచార వ్యయం 2018 నాటికి మూడో వంతుకు పెరుగుతుంది.
2018 కల్లా డిజిటల్ ప్రచార వ్యయం 20,401 కోట్ల డాలర్లకు, మొత్తం మీడియా ప్రచార వ్యయం 65,630 కోట్ల డాలర్లకు చేరతాయి.
రానున్న సంవత్సరాల్లో మీడియా ప్రచార వ్యయం 5% స్వల్ప వృద్ధినే సాధిస్తుంది.
డిజిటల్ ప్రచార వ్యయంలో దేశాల వారీగా చూస్తే అమెరికా, ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణ అమెరికాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్త డిజిటల్ వ్యయంలో 40 శాతం దక్షిణ అమెరికా ప్రాంతానిదే కావడం విశేషం. ఈ విషయంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం వాటా 29%గా, పశ్చిమ యూరప్ దేశాల వాటా గణనీయంగా ఉండగా, ఇతర ప్రాంతాల వాటా స్వల్పంగా ఉంది.
ఇక మొత్తం మీడియా ప్రచార వ్యయంలో డిజిటల్ ప్రచార వ్యయం వాటా ఇంగ్లాండ్‌లో అధికంగా ఉంది. ఈ విషయంలో 48 శాతం మార్కెట్ వాటాతో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్(40 శాతం), ఆస్ట్రేలియా(38%), అమెరికా(28 శాతం) ఉన్నాయి.