వెబ్... డబ్బు! | popularity increase online shows in India | Sakshi
Sakshi News home page

వెబ్... డబ్బు!

Published Fri, Dec 27 2013 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

వెబ్

వెబ్

* ఆన్‌లైన్ షోలకు పెరుగుతున్న ఆదరణ
* యోగా నుంచి వంటల వరకు ‘వీడియో ఆన్ డిమాండ్’
* సెల్, టాబ్లెట్ యూజర్లు లక్ష్యంగా కంపెనీల కార్యక్రమాలు

నూతన టెక్నాలజీతో పాటే కొత్త ఆదాయ మార్గాలూ అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్లో సినిమాలను, వీడియోలను ప్రజలు వీక్షించడం కూడా కంపెనీలకు ఆదాయ మార్గమే. డిట్టో టీవీ సాధించిన విజయమే ఇందుకు నిదర్శనం. మొబైల్ ఫోన్లూ, టాబ్లెట్లూ, ల్యాప్‌టాప్‌లలో 60 భారతీయ టీవీ చానళ్లను డిట్టో టీవీ ప్రసారం చేస్తోంది. కలర్స్, సోనీ, జీటీవీ ఆన్‌లైన్ వంటివి ఈ చానళ్ల జాబితాలో ఉన్నాయి. విశేషం ఏంటంటే, ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే డిట్టో టీవీ చందాదారుల సంఖ్య 2.92 లక్షలకు చేరడం.

 వీరంతా నెలకు రూ.10 నుంచి రూ.100 వరకు చెల్లించే యాక్టివ్ యూజర్లు. రూ.6,350 కోట్ల జీ గ్రూప్‌నకు చెందిన ఓవర్ ది టాప్(ఓటీటీ) విభాగమే డిట్టో టీవీ. దేశీయ అతిపెద్ద మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్‌కు గత మార్చిలో రూ.450 కోట్ల ఆదాయం రాగా అందులో 90%కి పైగా నాన్ ఫిజికల్ ఫార్మాట్ల ద్వారా వచ్చింది. ఇందులో... మ్యూజిక్‌ను ప్రసారం చేసినందుకు రెస్టారెంట్లు చెల్లించింది కొద్దిమొత్తం కాగా గానా.కామ్, యూట్యూబ్ తదితరాల్లో స్ట్రీమింగ్, డౌన్‌లోడ్ సేవల ద్వారా భారీ మొత్తం సమకూరింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించే చానల్‌గా మూడేళ్లకుపైగా టీ-సిరీస్ కొనసాగుతోంది.

22 కోట్ల మంది ఆన్‌లైన్ ...
ఆధునిక మొబైల్ ఫోన్లతో పాటు మెరుగైన బ్యాండ్‌విడ్త్ కూడా అందుబాటులోకి రావడంతో దేశంలో ఆన్‌లైన్‌లో వీడియోలను చూసే వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. సెక్యూరిటీ గార్డుల నుంచి స్టూడెంట్ల వరకు వివిధ రంగాలకు చెందిన 22.70 కోట్ల మందికిపైగా ప్రజలు ఆన్‌లైన్‌లో ఉన్నారు. సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, యోగా శిక్షణ, వంట పాఠాలు.. ఇలా పలు రకాల కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. గత నెలలో 5.90 కోట్ల మంది కనీసం ఒక వీడియో సైట్‌ను చూశారని కామ్‌స్కోర్ అనే డిజిటల్ అనాలిటిక్స్ కంపెనీ అంచనా. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే, సెల్‌ఫోన్లలో ఇలాంటి కార్యక్రమాలను వీక్షించే వారి సంఖ్యను కామ్‌స్కోర్ పరిగణనలోకి తీసుకోలేదు మరి.

 గతేడాది టీవీ ప్రోగ్రామ్‌లను చూసిన వారి సంఖ్యతో పోలిస్తే... ఆన్‌లైన్‌లో వీడియోలను వీక్షించిన వారి సంఖ్య 8 శాతం లోపే. ఆన్‌లైన్ వీడియో వీక్షకుల సంఖ్య ఏటేటా 10 శాతానికి పైగా వృద్ధి చెందుతోంది. 2011-12లో గూగుల్ ఇండియా ఆర్జించిన ఆన్‌లైన్ వీడియో ప్రకటనల ఆదాయం రూ.800 కోట్లు. తర్వాతి ఏడాది అది రూ.వెయ్యి కోట్లకు పెరిగింది. వీడియో వీక్షణకు జనం చెల్లించిన సొమ్ము కూడా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంది. ఆన్‌లైన్‌లో వీడియోలను చూసే వారిలో దాదాపు సగం మంది మొబైల్ ఫోన్లలోనే వీక్షిస్తున్నారని హంగామా డిజిటల్ మీడియా సీఈఓ నీరజ్ రాయ్ తెలిపారు.
 
భవిష్యత్తులో యూట్యూబ్‌తోనే పోటీ..
దేశీయ ఇంటర్నెట్ వినియోగదారుల్లో సగం మంది మొబైల్ ఉపయోగించేవారేననీ, వీరిలో అధికులు తొలిసారి వినియోగదారులేననీ అవెండస్ క్యాపిటల్ కంపెనీ అంచనా. వర్ధమాన దేశాల్లో వీరి సంఖ్య 20-25 శాతమే కావడం గమనార్హం. అంటే, ఆన్‌లైన్ వీడియోలు తిలకించే వారిలో కొత్తతరం వారే అధికమన్నమాట. పరిచయస్తులు మీకో ఫేస్‌బుక్ క్లిప్ పంపారనుకోండి... దాన్ని మీరు చూడడం ఖాయం కదా. ఆ విధంగా ఆన్‌లైన్ వీడియో వీక్షకుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. మీడియా హౌస్‌లు అందించే ప్రధాన కార్యక్రమాలు పెరగడానికీ, ఆన్‌లైన్ చార్టుల్లో టీవీ షోలు అగ్రస్థానంలో ఉండడానికీ కారణం ఇదేనని కామ్‌స్కోర్ ఇండియా సీనియర్ డెరైక్టర్ కేదార్ విశ్లేషించారు. ‘మరో ఐదేళ్ల తర్వాత స్టార్ టీవీ, జీ టీవీలతో మాకు పోటీ ఉండదు. యూట్యూబే ప్రధాన పోటీదారు అవుతుంది...’ అని వయాకామ్18 సీఈఓ రాజ్ నాయక్ అంటున్నారు.

 ఫలానా వీడియో క్లిప్పింగ్ కావాలని కోరే వారిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌టెల్ వంటి కంపెనీ రూపాయికే వీడియో క్లిప్పింగ్ ఆఫర్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లైవ్ వీడియోలను చూసే వారి సంఖ్య, ఫలానా వీడియో కావాలని కోరే వారి సంఖ్య దాదాపు సమానంగా ఉంటున్నాయి. యోగా శిక్షణ నుంచి వంటకాల తయారీ వరకు వివిధ రకాల కార్యక్రమాలను వీక్షకులు కోరుతున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగదారులు 10-15 నిమిషాల నిడివి ఉండే వీడియోలను కోరుతుండగా టాబ్లెట్ వినియోగదారులు 30-40 నిమిషాల వీడియోలను సైతం చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement