కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ | India restricts laptop, Tablets and Computers import to boost local manufacturing | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ

Published Sat, Aug 5 2023 4:45 AM | Last Updated on Sat, Aug 5 2023 4:45 AM

India restricts laptop, Tablets and Computers import to boost local manufacturing - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు.  

కొన్ని మినహాయింపులు ఉంటాయి..
‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్‌–ఇన్‌–వన్‌ పర్సనల్‌ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ జారీ చేసిన కన్సైన్‌మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది.

ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్‌అండ్‌డీ, టెస్టింగ్, రిపేర్‌ అండ్‌ రిటర్న్‌ తదితర అవసరాల కోసం కన్సైన్‌మెంట్‌కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్‌ పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్‌ ఫారం ఫ్యాక్టర్‌ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

బిలియన్‌ డాలర్ల కొద్దీ దిగుమతులు..
2022–23లో భారత్‌ 5.33 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పర్సనల్‌ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్‌ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్‌ తదితర ఎల్రక్టానిక్‌ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్‌ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది.

గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీíÙయేటివ్‌ (జీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం భారత్‌ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్‌ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్‌ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్‌ సెల్‌ మాడ్యూల్స్‌ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement