కొచ్చి : ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్‌పై కొందరు వ్యక్తులు మంగళవారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఆయన కారులో వెళ్తుండగా రాళ్లు రువ్వడంతో తలకు గాయమైంది. దీంతో ఆయన్ని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కోచిలోని ఐజీ ఆఫీస్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గతేడాది డిసెంబర్‌లో కేరళలోని 43 బ్రాంచ్‌ల్లో పనిచేస్తున్న 160 మంది సిబ్బందిని ముత్తూట్ సంస్థ తొలగించింది. దీంతో ఆ ఉద్యోగులు కొద్ది రోజులుగా సంస్థ నిర్ణయానికికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే మంగళవారం కొందరు జార్జ్‌పై దాడి చేశారు.
అయితే సీఐటీయూ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని ముత్తూట్ యాజమాన్యం ఆరోపించింది. సీఐటీయూ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడటం తమ విధానం కాదని సీఐటీయూ నాయకులు మీడియాకు తెలిపారు. జార్జ్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత పరిశ్రమల సమాఖ్య కేరళ విభాగం.. ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment