న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ) పనితీరును బలోపేతం చేసుకుంటూ... అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టేలా 100 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను (రోడ్‌మ్యాప్) రూపొందిం చుకోవాలని ప్రధాని మోదీ నిర్ధేశించారు. ఇందుకోసం తగిన లక్ష్యాలను సిద్ధం చేసుకోవాలన్నారు. సోమవారమిక్కడ జరిగిన సీపీఎస్‌ఈ సదస్సులో మోదీ మాట్లాడారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) వ్యయంలో భాగంగా ఏటా నిర్ధిష్ట అంశంపై(థీమ్) ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించాలని చెప్పారాయన.
సీఎస్‌ఆర్ కింద పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను విజయవంతంగా చేపట్టాడాన్ని ప్రశంసించారు. నీతి ఆయోగ్ గుర్తించిన 115 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి థీమ్ అని సూచించారు. నైపుణ్యాల కల్పన పథకాలను కూడా సీపీఎస్‌ఈలు ఎంచుకోవచ్చన్నారు. సరికొత్త భారత్ కోసం విజన్ –2020, వినూత్నతలు–సాంకేతికత, ఫైనాన్షియల్ రీ–ఇంజినీరింగ్, మానవ వనరుల నిర్వహణ, కార్పొరేట్ నైతికత వంటి అంశాలపై సదస్సులో ప్రత్యేకంగా ప్రదర్శనలను నిర్వహించారు.
స్వేచ్ఛనిస్తున్నాం...
పీఎస్‌యూలకు ప్రభుత్వం నిర్వహణాపరమైన స్వేచ్ఛనిస్తోందని.. దీన్ని సద్వినియోగం చేసుకుని పనితీరును మెరుగుపరచుకోవాలని ప్రధాని చెప్పారు. ‘మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి జాతి నిర్మాణం, ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎనలేని సేవలందిస్తున్నాయి. మీ (సీపీఎస్‌ఈలు) నుంచి నేను చాలా నేర్చుకోవాలి.
మరింత సమయం వెచ్చించినట్లయితే, ఆ అనుభవాన్ని ప్రభుత్వ నిర్వహణలో ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మీరు ప్రదర్శించిన ఈ అంశాలతో సరిగ్గా 100 రోజుల్లో సరైన రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తారని భావిస్తున్నా’ అని మోదీ వ్యాఖ్యానించారు.కాగా, చిన్న, మధ్య తరహా సంస్థ(ఎంఎస్‌ఎంఈ)ల నుంచి సీపీఎస్‌ఈలు తక్కువగా కొనుగోళ్లు చేస్తుండటం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని కొనుగోళ్లు జరపటమే కాక చెల్లింపులు కూడా సత్వరం చేయాలన్నారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని పర్యాటక ప్రాంతాల్లో తమ సదస్సులు, సమావేశాలను నిర్వహించుకోవాల్సిందిగా మోదీ సీపీఎస్‌ఈ యాజమాన్యాలకు సూచించారు. దీనివల్ల పర్యాటకాన్ని ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment