భారత్.. అవకాశాల గని
వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా తీర్చిదిద్దుతా
⇒ అందుకు వ్యక్తిగతంగా దృష్టిపెడతా
⇒ కొరియా ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్రమోదీ హామీ
సియోల్: అపార అవకాశాల గనిగా భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌లో వ్యాపారాల నిర్వహణ సులభతరంగా ఉండే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దక్షిణ కొరియా ఇన్వెస్టర్లతో ఆయన చెప్పారు. వ్యాపారవర్గాలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై తాను వ్యక్తిగతంగా దృష్టి పెడతానని మోదీ హామీ ఇచ్చారు.
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంగళవారం ఇండియా-సౌత్ కొరియా సీఈవోల ఫోరం తొలి సదస్సులో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో స్థిరమైన, పారదర్శకమైన పన్నుల విధానం ఉండేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించే క్రమంలో.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడం, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వేగవంతంగా ఇవ్వడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. ‘భారత్‌లో పరిస్థితులు మారాయి. వచ్చి చూడండి’ అని ఆయన ఆహ్వానించారు.
ఇన్‌ఫ్రా రంగం ముఖ్యంగా గృహ నిర్మాణాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయొచ్చని మోదీ చెప్పారు. అలాగే నీరు, రవాణా, రైల్వేలు, రేవులు, విద్యుదుత్పత్తి, ఐటీ తదితర రంగాలన్నింటిలోనూ పరస్పర సహకారానికి అవకాశాలు ఉన్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలంటే .. ఇతర దేశాలకు దీటుగా వ్యాపారాలకి అనువైన పరిస్థితులు కల్పించాలి కనుక ప్రధానంగా దీనిపై దృష్టి పెడుతున్నామన్నారు. 21 మంది సీఈవోలు, ఇతర వ్యాపార దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
కొరియా ప్లస్ ఏర్పాటు..: వ్యాపారాల నిర్వహణ విషయంలో కొరియన్ ఇన్వెస్టర్లకు సహకరించేందుకు కొరియా ప్లస్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని మోదీ చెప్పారు. తాను వ్యక్తిగతంగా వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతానని తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్న పన్నుపరమైన పలు వివాదాలను ఇప్పటికే పరిష్కరించామని ప్రధాని వివరించారు.
ఇవన్నీ మరింత టెక్నాలజీని, పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమేనని చెప్పారు. సమావేశం సందర్భంగా హ్యుందాయ్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, పోస్కో, ఎల్‌జీ వంటి దిగ్గజ సంస్థల అధిపతులతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు.
సీఈవో ఫోరం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కొరియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) చైర్మన్ పార్క్ యోంగ్ మన్.. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. గతేడాది గణాంకాల ప్రకారం భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 18.1 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో నిర్మాణ, రైల్వేస్ తదితర రంగాల్లో కార్యకలాపాలు విస్తరించడంపై హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది.
హ్యుందాయ్ ప్లాంటులో మోదీ..
నౌకల నిర్మాణం, మెరైన్ ఇంజిన్ల తయారీ మొదలైన వాటిల్లో పేరొందిన హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్ (హెచ్‌హెచ్‌ఐ) ప్లాంటును మోదీ సందర్శించారు. ఉల్సాన్‌లోని హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్(హెచ్‌హెచ్‌ఐ) ప్లాంటును మోదీ సందర్శించారు. దాదాపు గంటపాటు అక్కడ గడిపిన ప్రధాని.. హెచ్‌హెచ్‌ఐ చైర్మన్ చోయ్ కిల్-సియోన్‌తో సమావేశమయ్యారు. ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) క్యారియర్లు, ఓడల నిర్మాణానికి సంబంధించి సాంకేతికాంశాలపై భారత కంపెనీలకు తోడ్పాటు అందించే అంశంపై చర్చించారు.