జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చేతికి జేఎస్పీఎల్ ప్లాంట్
డీల్ విలువ రూ.6,500 కోట్లు
న్యూఢిల్లీ: నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్‌పీఎల్) 1,000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనున్నది. సజ్జన్, నవీన్ జిందాల్‌లు ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురు సావిత్రి దేవి జిందాల్ కొడుకులు. ఈ డీల్ విలువ రూ.6,500 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా జేఎస్‌పీఎల్‌కు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కనీసం రూ.4,000 కోట్లు చెల్లిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 1,000 మెగావాట్ల ప్లాంట్‌కు దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరితే, మిగిలిన రూ.2,500 కోట్లను చెల్లిస్తుంది. ఈ డీల్ 2018, జూన్ 30 మధ్యకల్లా పూర్తవుతుందని జేఎస్‌పీఎల్.. పేర్కొంది. జేఎస్‌పీఎల్ రుణ భారం రూ.46,000 కోట్లుగా ఉంది. ఈ డీల్‌కు ఇరు కంపెనీల వాటాదారులు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదాలను పొందాల్సి ఉంది.
జేఎస్‌డబ్ల్యూ కొనుగోళ్ల జోరు
జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ఇటీవలనే జై ప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన 1,391 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని జైప్రకాశ్ అసోసియేట్స్‌కు చెందిన 500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను, ఒడిశాలో మెనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీకి ఉన్న 1,050 మెగావాట్ల పవర్ ప్లాం ట్‌ను కూడా కొనుగోలు చేయనున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ కొనుగోళ్లన్నింటిని ఎవర్‌బెస్ట్ స్టీల్ అండ్ మైనింగ్ హోల్డింగ్స్ అనే ప్రత్యేక సంస్థ ద్వారా జరుపుతామని వివరించింది.