మరిన్ని కష్టాల్లో జిందాల్ స్టీల్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ ఎంపీ నవీన్ జిందాల్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు . న్యూఢిల్లీకి చెందిన, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్స్ చెల్లించని కారణంగా నష్టాల్లో కూరుకుపోయింది.రుణభారంతో సతమత మవుతున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ సెప్టెంబర్ 30 తేదీ నాటికి మార్పిడికి వీల్లేని డిబెంచర్ల(ఎన్‌సీడీలు)పై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైన వార్తలతో మరోసారి కుదేలైంది. గురువారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో 5 శాతానికి పైగా నష్టపోయింది.
ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపులో విఫమైనట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో బుధవారం జిందాల్ స్టీల్ వెల్లడించింది. జిందాల్ చెందిన 11 గ్రూపుల సెక్యూరిటీలు ఈ చెల్లింపుల్లో ఫెయిల్ అయినట్టు ప్రకటించింది. అయితే దీనికి కారణాలను కంపెనీ స్పష్టంగా వివరించ లేదు. 10ఏళ్ల కాలపరిమితిగల ఎన్‌సీడీలకు 9.8 శాతం కూపన్ రేటుకాగా, సెప్టెంబర్ 30న వీటిపై వడ్డీ చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న సంస్థ నికర అప్పుల విలువ రూ.46,000 కోట్లను దాటింది. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయంపై భారీ కసరత్తలులే చేస్తోంది. మరోవైపు కంపెనీ సీఈవో రవి ఉప్పాల అప్పులను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్తుల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, మొజాంబిక్ దేశాల్లో ఉన్న కుకింగ్ కోల్ మైన్స్ విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి రవి నిరాకరించారు.