ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్ పరిమితిని సగానికి సగం తగ్గించేసింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని బుధవారం నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజానికి ఎస్‌బీఐ ఈ నెల మొదట్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించినా... అక్టోబర్ 31 నుంచీ అమల్లోకి వస్తుందని అప్పట్లోనే ప్రకటించింది.
మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండటంతో, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల ద్వారా ఒకేరోజు పెద్ద మొత్తంలో నిధుల విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల మోసగాళ్లు సైతం రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు కనక ఒకవేళ ఎవరైనా మోసపోయినా మరీ ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకోకుండా ఉంటారన్నది తమ ఉద్దేశమని బ్యాంకు తెలియజేసింది. ఏదైనా మోసపూరిత విత్‌డ్రాయల్ జరిగితే వెంటనే కార్డ్ బ్లాక్ చేయించుకోవడం, సంబంధిత బ్రాంచీని సంప్రదించడం చేయాలని, దాంతో నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చని కూడా సూచించింది.
ఎక్కువ మొత్తం కావాలంటే దరఖాస్తు...
‘‘క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డ్‌పై విత్‌డ్రాయల్ పరిమితిని రూ.20,000కు తగ్గిస్తున్నాం. ఇతర కార్డులకు సంబంధించి రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు. క్లాసిక్–డెబిట్ కార్డ్ చిప్ ఆధారితం కాదు. కాబట్టి సెక్యూరిటీ పరమైన ఆందోళనలు ఉన్నాయి. పలు ఫిర్యాదులూ అందాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. రూ.20,000కు మించి విత్‌డ్రాయల్స్ కావాలనుకునేవారు హయ్యర్ కార్డ్ వేరియెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా తెలిపారు.
‘‘గణాంకాల విశ్లేషణ ప్రకారం– మెజారిటీ కార్డ్ హోల్డర్లు రోజుకు రూ.20,000లోపే ఏటీఎం విత్‌డ్రా చేస్తున్నారు. ఏదైనా మోసం కేసులు నమోదవుతున్నాయంటే, అవి రూ.20,000 పైబడే ఉన్నాయి’’ అని కూడా ఆయన పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐకి దాదాపు 42 కోట్ల మంది కస్టమర్లున్నారు. 2018 మార్చి నాటికి బ్యాంక్ 39.50 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేసింది. వీటిలో దాదాపు 26 కోట్ల కార్డులను విరివిగా వినియోగిస్తున్నారు. డెబిట్ కార్డుల జారీకి సంబంధించి ప్రస్తుతం ఎస్‌బీఐ మార్కెట్ వాటా దాదాపు 32.3 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment