జీఎస్టీ రేట్ల కోత... మార్కెట్‌ రయ్‌ | Nifty Above 11050 on GST Rate Cut Boost | Sakshi
Sakshi News home page

జీఎస్టీ రేట్ల కోత... మార్కెట్‌ రయ్‌

Published Tue, Jul 24 2018 12:28 AM | Last Updated on Tue, Jul 24 2018 12:28 AM

 Nifty Above 11050 on GST Rate Cut Boost - Sakshi

ముంబై: సెన్సెక్స్‌ మరోసారి నూతన గరిష్ట స్థాయిలకు దూసుకెళ్లింది. జీఎస్టీ కౌన్సిల్‌ పలు ఉత్పత్తులను తక్కువ పన్ను రేటు శ్లాబులోకి చేరుస్తూ నిర్ణయం తీసుకోవటం... అవిశ్వాస తీర్మానంలో మోదీ సర్కారు సునాయాసంగా విజయం సాధించటం మార్కెట్లకు ఊపునిచ్చాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు హిందుస్తాన్‌ యునిలీవర్, ఐటీసీతోపాటు ఏషియన్‌ పెయింట్స్‌ భారీగా లాభపడడం సోమవారం సూచీల ర్యాకి తోడ్పడింది.

అలాగే, వేదాంతా, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, మారుతి సుజుకి షేర్ల పెరుగుదలతో సూచీలు కొత్త శిఖరాలకు చేరాయి. సెన్సెక్స్‌ చివరికి 222.23 పాయింట్ల లాభంతో 36,718.60 వద్ద క్లోజయింది. అటు నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 11,093.40 పాయింట్ల వరకు వెళ్లగా, ముగింపులో 74.55 పాయింట్ల లాభంతో 11,084.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలో మాత్రం వాణిజ్య ఘర్షణల అంశాలతో మిశ్రమ ధోరణి కనిపించింది.

జీఎస్టీ రేట్లు తగ్గించడం, కంపెనీల ఫలితాల సీజన్‌ నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్లకు మద్దతుగా నిలిచినట్టు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. ‘‘తక్కువ జీఎస్టీ రేట్లతో మార్జిన్లు మెరుగుపడతాయన్న అంచనాల నేపథ్యంలో వినియోగ ఆధారిత కంపెనీల స్టాక్స్‌ లాభపడ్డాయి. ఇక ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఆర్‌బీఐ తన విధానాన్ని మరింత కఠినతరం చేయకుండా ఇది అడ్డుపడుతుంది’’ అని నాయర్‌ వివరించారు.  

బ్యాంకింగ్‌ స్టాక్స్‌కు మద్దతు
రూ.50 కోట్లు అంతకుమించిన ఎన్‌పీఏల పరిష్కారానికి ఆర్థిక సంస్థలతో బ్యాంకులు ఒప్పందం చేసుకోవడం స్టాక్స్‌ ధరలపై ప్రభావం చూపించింది. ఐసీఐసీఐ బ్యాంకు 3.33 శాతం, ఎస్‌బీఐ 2.09 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 2 శాతం చొప్పున పెరిగాయి. వేదాంత లిమిటెడ్‌ 4.42 శాతం, అదానీ పోర్ట్స్‌ 3.83 శాతం, ఐటీసీ 3.80 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 3.49 శాతం మేర లాభపడ్డాయి. టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ 2 శాతం వరకు పెరిగాయి.

పెయింట్స్, వార్నిష్‌లను 28 శాతం నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి మారుస్తూ తీసుకున్న నిర్ణయంతో ఏషియన్‌ పెయింట్స్, షాలిమార్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, నెరోలాక్‌ 2 నుంచి 4 శాతం వరకు లాభపడ్డాయి. పాద రక్షల కంపెనీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బాటా 7 శాతం, లిబర్టీ షూస్‌ 10 శాతం, మిర్జా ఇంటర్నేషనల్‌ 5 శాతం వరకు పెరిగాయి. యూపీఎల్‌ షేరు 15.5 శాతం లాభపడింది. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే అరిస్టా లైఫ్‌ సైన్సెస్‌ను 4.2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, టీపీజీలతో జట్టు కట్టడండో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

అమ్మకాలతో కుదేలైన స్టాక్స్‌
సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు సోమవారం ఏకంగా 17 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో 52 వారాల కనిష్ట స్థాయి 18.35 వరకు పడిపోయిన ఈ షేరు... చివరికి 18.60 వద్ద క్లోజ్‌ అయింది. జూన్‌ త్రైమాసికంలో లాభం భారీగా తగ్గిపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. విప్రో సైతం 2.5 శాతం క్షీణించి 276.05 వద్ద ముగిసింది. జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు చోటు చేసుకున్నాయి.   


ఒకే రోజు 1.29 లక్షల కోట్ల సంపద వృద్ధి
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నూతన గరిష్టాలకు చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సోమవారం ఒక్క రోజే రూ.1.29 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. సెన్సెక్స్‌ జీవిత కాల గరిష్ట స్థాయి 36,749.69ని నమోదు చేయడం, 222 పాయింట్లు లాభపడడంతో బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1,29,940.11 కోట్లు పెరిగి రూ.148.06 లక్షల కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement