జీఎస్‌టీకి మార్కెట్ స్వాగతం
♦ సానుకూల అంతర్జాతీయ సంకేతాల తోడ్పాటు
♦ సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్లు అప్
♦ ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోలు మద్దతు
ముంబై: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త పన్నుల వ్యవస్థ జీఎస్‌టీని స్వాగతిస్తూ స్టాక్ మార్కెట్ సోమవారం ర్యాలీ జరిపింది. ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక్క ఉదుటన 300 పాయింట్లు జంప్ చేసి, వారంరోజుల గరిష్టస్థాయి 31,222 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకేరోజులో సెన్సెక్స్ ఇంతభారీగా పెరగడం గత నెలరోజుల్లో ఇదే ప్రధమం. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్ల పెరుగుదలతో 9,615 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జీఎస్‌టీ అమలుతో ఆర్థికాభివృద్ధికి ఉద్దీపన కలుగుతుందన్న అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకులు చెప్పారు.
మొత్తంమీద జీఎస్‌టీతో పన్నులు తగ్గుతాయని, దాంతో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలు వున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. గత రెండు వారాలుగా కొద్దిపాటి ఒడుదుడుకులతో కన్సాలిడేట్ అవుతున్న మార్కెట్‌కు జీఎస్‌టీ అమలు జోష్‌నిచ్చిందని ఆయన వివరించారు. జీఎస్‌టీ అమలుతో ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందన్న అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అంతర్జాతీయ మార్కెట్లకు సంబంధించి ప్రధాన ఆసియా సూచీలు స్వల్పంగా పెరగ్గా, యూరప్ సూచీలు 1 శాతం లాభంతో ముగిసాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్, ఎస్ అండ్ పీ సూచీలు 0.7 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. గూగుల్‌తో సహా కొన్ని ప్రధాన ఐటీ షేర్లు క్షీణించడంతో నాస్‌డాక్ స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది.
ఐటీసీ 6 శాతం అప్...
జీఎస్‌టీ అమలుతో ప్రయోజనం పొందే కంపెనీల్లో ఒకటిగా భావిస్తూ కొద్దిరోజుల నుంచి ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్న ఐటీసీ తాజాగా 5.7 శాతం ఎగిసి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 342.80 వద్ద ముగిసింది. జీఎస్‌టీ ప్రభావిత షేర్లుగా ఆటోమొబైల్ షేర్లు కూడా పెరిగాయి.
మైండ్ ట్రీ బైబ్యాక్‌కు రికార్డుతేదీ జూలై 11
ఐటీ కంపెనీ మైండ్ ట్రీ ప్రతిపాదించిన బైబ్యాక్ ప్రణాళికకు జూలై 11 రికార్డుతేదీగా నిర్ణయించింది. ఆ తేదీలోపున షేర్లు కలిగిన షేర్‌హోల్డర్లు బైబ్యాక్ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు కంపెనీ లెటర్ ఆఫ్ ఆఫర్ పంపిస్తుంది. షేరుకు రూ. 625 మించకుండా 43.2 లక్షల షేర్లను (2.5 శాతం వాటా) కంపెనీ కొనుగోలు చేసేందుకు రూ. 270 కోట్లతో బైబ్యాక్‌ను ప్రతిపాదించారు.