సాక్షి, ముంబై: భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సంకేతాల నేపథ్యంలో కీలక సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల ట్రిపుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ మరింత జోరందుకుంది. 605 పాయింట్లు దూసుకెళ్లి 35,037ను తాకింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు జంప్‌చేసి 10,568వద్ద కొనసాగుతోంది.
ర్యాలీకి మద్దతునిస్తున్న అయిదు అంశాలు
అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, జీఎస్‌టీ వసూళ్లు, పుంజుకున్న రూపాయి విలువ, అంతర్జాతీయంగా దిగి వస్తున్న క్రూడ్ ధరలు , బాండ్‌మార్కెట్ తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు చెప్పారు. అమెరికా చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్‌వార్ ముగింపు దిశగా అమెరికా అధ‍్యక్షుడు ట్రంప్ తాజా వ్యాఖ్యలు, దీంతోపాటు ఈ నెలాఖరున అర్జెంటీనాలో జరగనున్న జీ20 దేశాల సదస్సులో చైనీస్ ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యే యోచనలో ఉన్నట్లు ట్రంప్ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఐటీ, ఫార్మా తప్ప అన్ని రంగాల్లోనూ లాభాలే. ఆటో, మెటల్, కొన్ని బ్యాంకింగ్ రంగ షేర్లు ఎఫ్‌ఎంసీజీ షేర్ల లాభాలు మార‍్కెట్లను లీడ్ చేస్తున్నాయి. బీపీసీఎల్, వేదాంతా, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, హీరోమోటో, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, యస్‌బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ భారీగా లాభపడుతున్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment