ఎన్‌ఐఐటీ టెక్ లాభం 36 శాతం వృద్ధి
క్యూ1లో రూ. 58.5 కోట్లు
న్యూఢిల్లీ : ఐటీ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్.. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో రూ.58.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43.2 కోట్లతో పోలిస్తే లాభం 35.5 శాతం ఎగబాకింది. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారంలో పటిష్టమైన వృద్ధి దీనికి దోహదం చేసింది. ఇక క్యూ1లో కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం వృద్ధి చెంది రూ. 578 కోట్ల నుంచి రూ.641 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు ఇతరత్రా వ్యయాలు ఉన్నప్పటికీ..
అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారంలో 8.9 శాతం వృద్ధి(మార్చి క్వార్టర్‌తో పోలిస్తే) నమోదుకావడంతో నిర్వహణ మార్జిన్లు పుంజుకున్నాయని కంపెనీ సీఈఓ, జాయింట్ ఎండీ అరవింద్ టాకూర్ పేర్కొన్నారు. కాగా, క్యూ1లో కంపెనీ 15 కొత్త క్లయింట్లను దక్కించుకుంది. 734 మంది కొత్త ఉద్యోగులు జతకావడంతో జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 9,228కి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఐఐటీ టెక్ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో 11.2 శాతం ఎగబాకి రూ.464 వద్ద ముగిసింది.