
టెలికం స్టార్టప్ ‘మబుల్’లో నీలేకని పెట్టుబడులు
న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ మబుల్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇది యూజర్లు తమ మొబైల్ డేటా వాడకం, టెలికం వ్యయాలను ట్రాక్ చేసుకునేందుకు, నియంత్రించేందుకు ఉపయోగపడే యాప్ సర్వీసులను అందిస్తోంది. వ్యక్తిగత హోదాలో నీలేకని ఇన్వెస్ట్ చేశారని, మొబైల్ టెక్నాలజీ ప్రోడక్టు కంపెనీలో ఆయన పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారని మబుల్ సీఈవో అశ్విన్ రామస్వామి తెలిపారు. అయితే మబుల్‌లో నీలేకని ఎంత ఇన్వెస్ట్ చేసినదీ వెల్లడి కాలేదు.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు మబుల్ తోడ్పాటు అందించగలదని నీలేకని పేర్కొన్నారు. ఆయన ఇటీవలే టీమ్ ఇండస్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థలోనూ ఇన్వెస్ట్ చేశారు. ఐఐటీలో చదివిన రామస్వామి, ప్రణవ్ ఝా, రాఘవేంద్ర వర్మ కలిసి 2013లో మబుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ యాప్ ఆరు నెలల్లో అయిదు లక్షల పైగా డౌన్‌లోడ్‌లు నమోదు చేసింది.