నాలుగేళ్లలో మౌలికంలోకి భారీ పెట్టుబడులు
♦ రూ.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులొస్తాయి
♦ 4 కోట్ల ఉద్యోగాల సృష్టి అవకాశం: గడ్కరీ
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోకి 2019 నాటికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ విశ్వాసం వ్యక్తం చేశారు. దీనివల్ల దాదాపు 4 కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టుల తక్షణ పునరుద్ధరణపై దృష్టి సారిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మౌలిక రంగం పురోభివృద్ధికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ దాదాపు 21 ప్రధాన నిర్ణయాలు తీసుకుందంటూ... ‘‘ఈ రంగం వృద్ధి లక్ష్యాల మేరకు నమోదయితే.. 2019 నాటికి జీడీపీలో ఈ విభాగం వాటా గణనీయంగా పెరుగుతుంది.
గడచిన రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల మేర ప్రాజెక్టుల మంజూరయ్యాయి. కానీ వచ్చే రెండేళ్లలో కనీసం రూ.5 లక్షల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తాం. వ్యాపార నిర్వహణ, లాభదాయకతకు సంబంధించి 2014లో ఉన్న నిరాశాకర పరిస్థితులు మారుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల పునఃప్రారంభానికి ఇదే కారణమన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు పెట్టుబడుల విషయంలోనూ పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని గడ్కరీ చెప్పారు.