
అరుదైన ఖనిజాల వేటలో ఎన్‌ఎండీసీ..
♦ బీచ్‌శాండ్, భూగర్భ ఖనిజాలపై దృష్టి
♦ దేశంలో బంగారం శుద్ధి కర్మాగారం
♦ ఆటమిక్ డెరైక్టరేట్‌తో సంప్రదింపులు
హైదరాబాద్: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ అరుదైన భూగర్భ ఖనిజాలతో పాటు బీచ్ శాండ్ మైనింగ్‌లోకి కూడా ప్రవేశించనుంది. ఈ భూగర్భ ఖనిజాలు కొన్నింట్లో రేడియోధార్మికత వెలువడే అవకాశం ఉన్నందున ఈ మేరకు అనుమతులకై ఆటమిక్ మినరల్ డెరైక్టరేట్‌ను (ఏఎండీ) సంప్రదించే పనిలో ఉంది. ఇప్పటి వరకు ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజంతోపాటు కొంతమేర వజ్రాల అన్వేషణలో మాత్రమే నిమగ్నమైంది. ఇక నుంచి అరుదైన ఖనిజాలు, బంగారంతోపాటు బీచ్ శాండ్ తవ్వకాలపైనా దృష్టిసారించనున్నట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టాంజానియాలో సంస్థకు ఇప్పటికే బంగారు గని ఉంది. దీంతో అక్కడ పైలట్ ప్రాతిపదికన బంగారం శుద్ధి చేసే కేంద్రాన్ని నెలకొల్పాలని ఎన్‌ఎండీసీ యోచిస్తోంది. ఈ ప్లాంటు ఏర్పాటు పనులను ఒక ఏజెన్సీకి అప్పగించే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఈ ఏడాదే ఆహ్వానించనున్నారు కూడా. ఐదారు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, టెండరు ప్రక్రియ పూర్తయిన తరవాత 12-18 నెలల్లో ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సదరు అధికారి వెల్లడించారు.
స్టీలు ప్లాంటులో వాటా విక్రయం..
అనుబంధ కంపెనీ అయిన జార్ఖండ్ కొల్హన్ స్టీల్‌లో వాటాను ఎస్‌పీవీ ద్వారా విక్రయించాలని సంస్థ భావిస్తోంది. స్టీలు ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీకి ఈ వాటాను అమ్మాలని ఎన్‌ఎండీసీ నిర్ణయించింది. ఇనుప ఖనిజం సరఫరా, గనుల నిర్వహణకు ఎన్‌ఎండీసీ పరిమితం కానుంది. జార్ఖండ్ ప్రభుత్వం స్థలాన్ని సమకూరుస్తుందని, అనుమతులను తాము సంపాదిస్తామని మైనింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ స్టీలు ప్లాంటుకు తాము ఎటువంటి మొత్తాన్ని పెట్టుబడి చేసే ఉద్ధేశం లేదని సంస్థ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.