మిస్త్రీకి దక్కని ఊరట!
• మధ్యంతర ఆదేశాల జారీకి కంపెనీ లా ట్రిబ్యునల్ తిరస్కరణ
• జనవరి 31, ఫిబ్రవరి 1న విచారణ
• నెలలో విచారణ ముగించి ఆదేశాల జారీకి సమ్మతి
• స్పందన తెలియజేయాలని టాటాసన్స్‌కు ఆదేశాలు
ముంబై: మధ్యంతర ఆదేశాలు కోరుతూ టాటా గ్రూపుపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సైరస్ మిస్త్రీకి నిరాశ ఎదురైంది. టాటా గ్రూపు చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ ఆ తర్వాత గ్రూపు నిర్వహణ లోపాలపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టాటా గ్రూపు కంపెనీల బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మిస్త్రీ మరుసటి రోజే కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్Sతోపాటు, మిస్త్రీ కుటుంబానికే చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో విచారణ జరిపేందుకు ట్రిబ్యునల్ డివిజన్ బెంచ్ అంగీకరించింది.
అయితే, ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉపశమనం కల్పించాలన్న పిటిషనర్ వినతిని పరిశీలించబోమని... అసలు మధ్యంతర చర్యలను అనుమతించబోమని స్పష్టం చేసింది. వారంలోగా పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని సైరస్ పల్లోంజి మిస్త్రీని బెంచ్ కోరింది. అలాగే, 15 రోజుల్లోగా స్పందన తెలియజేయాలని టాటా సన్స్, పిటిషన్‌లో ఇతర ప్రతివాదులను ఆదేశించింది. తాత్కాలిక ఉపశమనంపై విచారణకు తిరస్కరించిన డివిజన్ బెంచ్... విచారణను వేగంగా పూర్తి చేసి ఓ నెలలో ఆదేశాలు జారీకి అంగీకరించడం పిటిషనర్లకు దక్కిన కొంచెం ఊరటగా చెప్పుకోవచ్చు.
రతన్ టాటాను బోర్డుకు దూరంగా ఉంచాలి...
కంపెనీ లా బోర్డు (ఎన్‌సీఎల్‌టీ)లో మిస్త్రీ కుటుంబ నిర్వహణలోని కంపెనీలు సెక్షన్ 241, 242 కింద పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం డివిజన్‌బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణకు రాగా, దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎ.సుందరం తన వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ జరిగేంత వరకు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ (టాటా గ్రూపు కంపెనీల నిర్వహణ సంస్థ) బోర్డు, ఇతర టాటా గ్రూపు కంపెనీల నుంచి తొలగించకుండా... గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా, టాటాసన్స్‌ను ఆదేశించాలని ట్రిబ్యునల్‌ను కోరారు. రతన్ టాటా బోర్డు సమావేశాలకు హాజరు కాకుండా, టాటా సన్స్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నిరోధిస్తూ తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించి... వారి సారధ్యంలో కొత్తగా స్వతంత్ర డైరెక్టర్లను నియమించాలని కూడా కోరారు. అలాగే, టాటా సన్స్‌లో పిటిషనర్ల (మిస్త్రీ కుటుంబం)కు ప్రస్తుతం ఉన్న వాటాను తగ్గించే దిశగా కొత్తగా ఎలాంటి సెక్యూరిటీలను జారీ చేయకుండా టాటా సన్స్‌ను ఆదేశించాలని పేర్కొన్నారు. టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి చెందిన పల్లోంజీ గ్రూపునకు 18 శాతం వాటా ఉంది. టాటాసన్స్ అణచివేత ధోరణిని ప్రశ్నిస్తూ... మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించే విషయంలో టాటా కంపెనీలు, నాన్ ప్రమోటింగ్ డైరెక్టర్ల మద్దతు లేకపోయినా టాటా సన్స్ సెక్షన్ 169 కింద ప్రత్యేక నోటీసు జారీ చేయడం ముసుగు దాడిగా పిటిషనర్ పేర్కొన్నారు. సైరస్ పీ మిస్త్రీ, నుస్లీ వాడియాలు చేసిన ఆరోపణలను ఇంతవరకు ప్రతివాదులు ఖండించలేదని న్యాయవాది సుందరం ట్రిబ్యునల్‌కు వివరించారు. అయితే, టాటా సన్స్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్‌సింఘ్వి మాత్రం పిటిషనర్ల ఆరోపణలు ఆధారరహితమని పేర్కొన్నారు. దీనిపై ట్రిబ్యునల్ ఆదేశిస్తే స్పందన దాఖలు చేస్తామన్నారు.
నోటీసు లేకుండా తప్పించారు...
‘‘ముందస్తు నోటీసు ఇవ్వకుండా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగించారు. అసలు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించలేదు. నుస్లీ వాడియా సహా టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల్లో పలువురు స్వతంత్ర డైరెక్టర్లను సైతం ఇదే విధంగా అణచివేసే ప్రయత్నం జరిగింది. టాటా సన్స్‌లో టాటా ట్రస్టీల పాత్రపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. అలాగే, టాటా సన్స్, టాటా గ్రూపు కంపెనీల్లో వీరిని జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలి. టాటాసన్స్, సి.శివశంకరన్, అతని వ్యాపార సంస్థల మధ్య... మెహ్లీమిస్త్రీ, అతని అనుబంధ కంపెనీలతో జరిగిన అన్ని లావాదేవీలు, వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలి.
అలాగే, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ‘మిస్త్రీని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తప్పించేందుకు టాటా సన్స్... టాటామోటార్స్ షేర్లను కొనుగోలు చేయడం వల్ల రూ.158.65 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది మిస్త్రీని బయటకు పంపేందుకు వీలుగా టాటా మోటార్స్‌లో టాటా సన్స్ తన ఓటింగ్ బలాన్ని పెంచుకునేందుకే. టాటాసన్స్, వాటాదారుల ప్రయోజనాల కోసం కాదు. ఈ నిధులను వెనక్కి తీసుకోవాలని టాటా సన్స్‌ను ఆదేశించాలి’’ అని పిటిషన్‌లో మిస్త్రీ కుటుంబ కంపెనీలు కోరాయి. అలాగే, రతన్‌టాటా, ఎన్‌ఏ సూనవాలా తదితరులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని ట్రిబ్యునల్‌ను కోరడం గమనార్హం.
టాటా స్టీల్ బోర్డు నుంచి నుస్లీవాడియా ఔట్
న్యూఢిల్లీ: టాటా స్టీల్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న నుస్లీవాడియాను తొలగించింది. వాడియాను తొలగించే తీర్మానంపై మెజారిటీ వాటాదారులు అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 97.12 కోట్ల షేర్లకు గాను 62.54 శాతం వాటాలకు సంబంధించిన ఓట్లు పోలయ్యాయని, ఇందులో మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి అనుకూలంగా 56.79 కోట్లు (90.80).. వ్యతిరేకంగా 5.75 కోట్ల ఓట్లు (9.20%) వచ్చాయని టాటా స్టీల్ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. టాటా స్టీల్‌లో ప్రమోటర్ అయిన టాటా సన్స్, ఇతర ప్రమోటింగ్ కంపెనీలకు కలిపి మొత్తం 30.45 కోట్ల షేర్లున్నాయి.
ఇందులో వాడియాను తొలగించే తీర్మానంపై 29.59 కోట్ల వాటాలకు సంబంధించిన ఓట్లు నమోదైనట్లు టాటా స్టీల్ తెలిపింది. ప్రమోటర్లను మినహాయించి చూసినా... సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లలో నాలుగింట మూడొం తుల ఇన్వెస్టర్లు వాడియాను తొలగించాలని ఓటు వేసినట్టు పేర్కొంది. సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియాలను బోర్డు నుంచి తొలగించేందుకు టాటా కెమికల్స్ ఈజీఎం ఏర్పాటు చేయగా, మిస్త్రీ ఇంతకుముందే రాజీనామా చేయడంతో వాడియాను తొలగించే తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగింది. టాటా సన్స్ చేసిన ఆరోపణలపై రతన్‌టాటా, టాటాసన్స్, పలువురు డైరెక్టర్లపై వాడియా రూ.3,000 కోట్ల పరువు నష్టం వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే.