సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో వివాదం కేసులో ప్రతికూల తీర్పు వచ్చిన నేపథ్యంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు తనను నిరాశపర్చాయని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో సంస్థ శ్రేయస్సు కోసమే నిర్ణయాలు తీసుకున్నానని, అంతరాత్మ సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తున్నానని మిస్త్రీ తెలిపారు. ‘తాము తీసుకున్న నిర్ణయాలకు న్యాయ స్థానాల్లాంటి వ్యవస్థల నుంచి తోడ్పాటు లభిస్తుందని సమాజంలో ప్రతీ ఒక్కరు ఆశిస్తారు. టాటా సన్స్ మైనారిటీ షేర్‌హోల్డరుగా, మా కేసులో వచ్చిన తీర్పు నాకు వ్యక్తిగతంగా నిరాశ కలిగించింది‘ అని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. (మిస్త్రీకి టాటా రైటే..!)
వ్యక్తుల కన్నా గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఉండేలా, షేర్‌హోల్డర్ల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే డైరెక్టర్లు నిర్భయంగా విధులను నిర్వర్తించేలా టాటా గ్రూప్‌లో మార్పులను తెచ్చేందుకు తాను ప్రయత్నించానని ఆయన తెలిపారు. ‘టాటా గ్రూప్ గవర్నెన్స్‌ను నేను ఇకపై ప్రత్యక్షంగా ప్రభావితం చేయలేకపోయినా నేను లేవనెత్తిన అంశాల గురించి పునరాలోచన జరుగుతుందని ఆశిస్తున్నాను. జీవితం అంటే పూలబాటే కాదు, సమస్యలూ ఉంటాయి. అయితే కష్టకాలంలో కుటుంబసభ్యులు, మిత్రులు, సహచరులు నా వెన్నంటే ఉంటుండటం అదృష్టం‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. (ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు)
Comments
Please login to add a commentAdd a comment