హాల్‌మార్క్ ఉన్నా స్వచ్ఛతలో తేడాలు..
పసిడి సర్టిఫికేషన్‌పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న పసిడి ఆభరణాల్లో సైతం నాణ్యతకు సంబంధించి వ్యత్యాసాలు ఉంటున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి ఆభరణాల ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో 40 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలంటే హాల్‌మార్కింగ్ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోక తప్పదని పేర్కొంది. గోల్డ్ డిపాజిట్ స్కీము విజయవంతం కావాలన్నా కూడా ఇది కీలకమని ఒక నివేదికలో తెలిపింది. బంగారం స్వచ్ఛత ప్రమాణాలను తెలిపే హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను వినియోగదారుల వ్యవహారాల శాఖలో భాగమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పర్యవేక్షిస్తోంది.
హాల్‌మార్కింగ్ అన్నది ప్రస్తుతం తప్పనిసరి కాకుం డా స్వచ్ఛందంగానే ఉంటోంది. దేశీయంగా 30% ఆభరణాలకు హాల్‌మార్కింగ్ ఉంటున్నప్పటికీ.. వాటి నాణ్యత, కొన్ని హాల్‌మార్కింగ్ సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా ఉంటున్నాయని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఫలితంగా కచ్చితమైన ప్రమాణాలున్న ఆభరణాలు 30 శాతం కన్నా ఇంకా తక్కువే ఉండొచ్చని వివరించింది. బీఐఎస్ వద్ద చాలినన్ని వనరులు లేకపోవడం వల్ల కూడా నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా అమలయ్యేలా చూడటంలో సమస్యలు ఎదురవుతున్నాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు. ఇక హాల్‌మార్కింగ్ సెం టర్లు సైతం మౌలిక సదుపాయాల కొరత, తక్కువ లాభదాయకత త దితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని వివరించారు. దేశీయంగా బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాలు 220 ఉన్నాయి.
తీసుకోతగిన చర్యలు..
చాలా మంది కొనుగోలుదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి హాల్‌మార్కింగ్‌పై పెద్దగా అవగాహన ఉండటం లేదని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల్లో బంగారం హాల్‌మార్కింగ్ వల్ల ప్రయోజనాల గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని డబ్ల్యూజీసీ పేర్కొంది. బ్రిటన్ తరహాలో వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని డబ్ల్యూజీసీ తెలిపింది.