సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రయివేటు పరం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చివరిరోజు ఇబ్బడి ముబ‍్బడిగా బిడ్లు వస్తాయని ఆశించిన సర్కార్ చివరికి సింగిల్ బిడ్‌ను కూడా సాధించలేకపోయింది. ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు చివరి రోజు అయిన మే 31వ తేదీ గురువారం కూడా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. బిడ్‌లు వేసేందుకు సంస్థల నుంచి కనీస స్పందన కరువైంది. ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి బిడ్డర్లనుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ, తదుపరి చర్యలను త్వరలోనే నిర్ణయిస్తామని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కాగా వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉన్న ఎయిరిండియాను ప్రయివేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం సంస్థలో 76శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడింది. ఇందుకోసం బిడ్డర్లను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్‌లు వేసేందుకు మే 14 వరకు గడువు పెట్టింది. అయితే మొదట జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో, టాటా లాంటి సంస్థలు ఎయిరిండియాలో వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. అయితే వాటా విక్రయంపై ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వాటా కొనుగోలు అనంతరం ఎయిరిండియాను వారి సొంత సంస్థల్లో విలీనం చేయరాదని, పాత సిబ్బందిని తొలగించరాదని పేర్కొంది. దీంతో నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ చాలా సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. నిబంధనల్లో కొన్ని మార్పులు చేసిన అనంతరం బిడ్ వేసేందుకు గడువును మే 31వరకు పొడిగించింది. నిబంధనలను సవరించి, గడువు పొడిగించినా కూడా బిడ్‌ను సాధించడంలో విఫలం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment