న్యూఢిల్లీ : ఫేస్‌బుక్, వాట్సాప్ ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు భారత్ చాలా పాపులర్. యువత ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా దిగ్గజాలను వాడుతుంటారు. ఈ రెండింటికి కలిపి భారత్‌లో 57 కోట్లకు పైగానే యూజర్లు ఉన్నారు. అంటే అమెరికా కంటే భారత్‌లోనే ఈ ప్లాట్‌ఫామ్‌లకు యూజర్లు ఎక్కువ. ఇంత ఫేమస్ అయిన ఈ కంపెనీల్లో టాప్ పోస్టును అలకరించడానికి సీనియర్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. కానీ భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు భారత్‌లో అధినేతలు దొరకడం లేదు. దొరకడం లేదు కాదు, ఎవరూ ఈ పదవిని అలంకరించడానికి ముందుకు రావడం లేదు.
వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఇటీవల భారత్‌లో ఆంక్షలు పెరిగిపోయాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నకిలీ న్యూస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఈ వార్తలతో బాగా మూకదాడులు జరుగుతున్నాయంటూ.. ప్రభుత్వం ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు కఠిన హెచ్చరికలే జారీ చేసింది. అంతేకాక ఈ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన ఆంక్షలే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ కంపెనీలకు టాప్ ప్రతినిధులు దొరకడం లేదు.
ఫేస్‌బుక్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటున్న ఉమాంగ్ బేడి 2017 అక్టోబర్‌లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెటింగ్ సొల్యుషన్స్ హెడ్ సందీప్ భూషణ్ ఆ పదవిని తాత్కాలికంగా అలకరించారు. కానీ కొత్త వారిని నియమించడం ఆ కంపెనీకి కష్టంగా మారింది. ఎండీ పదవి, వైస్-ప్రెసిడెంట్ పోస్ట్‌తో సమానం. అంటే స్టాక్ ఆప్షన్లతో కలిపి, వార్షికంగా రూ.14 కోట్లకు పైగా పరిహారాలు పొందుతారు. కానీ కోట్లు ఆఫర్ చేస్తున్న భారత్‌లో ఈ కంపెనీలకు ఎండీ పదవిని చేపట్టేందుకు ఏ సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్ ముందుకు రావడం లేదని తెలిసింది.
ఫేస్‌బుక్ ప్రస్తుతం స్టార్ ఇండియా ఎండీ సంజయ్ గుప్తా, టాటా స్కై ఎండీ హరిత్ నాగ్‌పాల్, హాట్‌స్టార్ సీఈవో అజిత్ మోహన్‌ల పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో ఒకరిని ఖరారు చేయాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాలి. అంతేకాక, ఫేస్‌బుక్‌లో మొత్తంగా డజనుకు పైగా సీనియర్-లెవల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు వాట్సాప్‌కు కూడా భారత్ హెడ్‌ను నియమించడం క్లిష్టంగా మారింది. ఇప్పటికే వాట్సాప్‌లో తప్పుడు సమాచారంతో బాగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం మండిపడుతోంది. వాట్సాప్ ఇప్పటి వరకు భారత్‌లో ఎందుకు గ్రీవియెన్స్ ఆఫీసర్ నియమించలేదో సమాచారం చెప్పాలంటూ ప్రభుత్వానికి, ఆ కంపెనీకి సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment