ఇదంతా ఆన్‌లైన్ యుగం.. అంతా ఆన్‌లైన్ మయం. కొన్ని కొన్ని విషయాల్లో ఆన్‌లైన్‌లో జరిగే రచ్చ మామూలుగా ఉండదు. ముఖ్యంగా పెద్ద కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ను ఎడాపెడా వాడేస్తుంటారు. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నకిలీ వార్తలు, రాజకీయ ప్రకటనలను వెదజల్లేందుకు వ్యక్తులు, రాజకీయ పార్టీలు, పలు సంస్థలు కాచుకుని కూర్చున్నాయి.ఇలాంటి వాటి వల్ల తమ విశ్వసనీయత సన్నగిల్లే అవకాశం ఉండటంతోపాటు స్థానిక ప్రభుత్వాల నుంచి అక్షింతలు పడే నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలు పలు చర్యలకు పూనుకుంటున్నాయి. ఎన్నికల వేళ నకిలీ వార్తలను కట్టడి చేసే దిశగా వాట్సాప్.. రాజకీయ ప్రకటనల విషయంలో పారదర్శకతకు ఫేస్‌బుక్ సంస్థలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి.
వాట్సాప్‌కు మెషీన్ లెర్నింగ్ సాయం..
మెషీన్ లెర్నింగ్ సాంకేతికత సాయంతో ఒకేసారి భారీగా పంపే సందేశాలను (బల్క్ మెసేజ్‌లు), నకిలీ వార్తలను నిలువరించేందుకు వాట్సాప్ సంసిద్ధమవుతోంది. భారత్‌లో 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రతి రోజూ వాట్సాప్ వాడుతున్నారు. దీన్ని దుర్వినియోగం చేసే ధోరణులూ అంతకంతకూ పెరుగుతున్నాయి. నకిలీ వార్తల వ్యాప్తికి ఈ ప్లాట్‌ఫామ్ వాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వాట్సాప్ పలు నిబంధనలు విధించింది. వినియోగదారులు ఇతరులకు పంపే సందేశాలు ఏరోజైనా ఐదుకు మించరాదనే పరిమితిని గతంలో విధించిన విషయం తెలిసిందే. తాజాగా మెషీన్ లెర్నింగ్ ద్వారా బల్క్ మెసేజ్‌లపైనా నిఘా పెట్టనుంది. ఒక దేశంలో రిజిస్టర్ అయిన ఫోన్‌లో వేరే దేశపు నెట్‌వర్క్ ఉపయోగిస్తుండటం, ఓ నంబర్‌ను ఇద్దరి మధ్య సంభాషణకు కాకుండా, బల్క్ మెసేజ్‌లు పంపేందుకు మాత్రమే వాడుతుండటం వంటి వాటిని ఛేదించేందుకు మెషీన్ లెర్నింగ్ సాయం తీసుకోనుంది.
మూగబోయిన లక్షల ఖాతాలు..
తప్పుడు సమాచారాన్ని, అశ్లీలతను, నకిలీ వార్తలను అడ్డుకునే క్రమంలో వాట్సాప్ గతంలోనే చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గత 3 మాసాల్లో నెలకు 20 లక్షలకు పైగా అకౌంట్లను వాట్సాప్ నిషేధించింది. బల్క్ మెసేజ్‌లను కట్టడి చేసేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని యూజర్లకు అర్థమవడం కోసం ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది.
ఖాతాల స్తంభన ఇలా..
వాట్సాప్ ఉపయోగించాలనుకుంటే మొట్టమొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం వాట్సాప్ ఎస్‌ఎంఎస్ లేదా ఫోన్ కాల్ ద్వారా వన్ టైమ్ కోడ్ పంపుతుంది. వినియోగదారు ఫోన్‌లో ఆ కోడ్ ఎంటర్ చేయాల్సివుంటుంది. ఆ తర్వాత, సంబంధిత యూజర్ ఇటీవల కాలంలో అనుమానాస్పద/దుర్వినియోగ చర్యలకు పాల్పడినట్టయితే సదరు నంబర్ ఆధారంగా పసిగట్టేయవచ్చు. ఆ విధంగా రిజిస్ట్రేషన్ స్థాయిలోనే ఖాతాను బ్లాక్ చేసేయవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ దశలో పట్టుబడని వారు తర్వాత దశలో తప్పించుకోలేకపోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న 5 నిమిషాల్లోపే 15 సెకన్ల వ్యవధిలో 100 సందేశాలు పంపే ప్రయత్నం చేసినట్టయితే, సంబంధిత వ్యక్తి అకౌంట్‌ను నిషేధించడం జరుగుతుంది. రిజిస్టర్ చేసుకున్న 5 నిమిషాల్లో వేగంగా గ్రూప్‌లు క్రియేట్ చేసినా.. లేదంటే ఇప్పటికే ఉన్న పలు గ్రూప్‌లలో వేలాదిమంది యూజర్లను జోడించినా సంబంధిత వ్యక్తి ఖాతాను నిషేధిస్తుంది. ఇలా 3 దశల్లో చాట్ యాప్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాట్సాప్ సిద్ధమైంది.
అనుమానాస్పదమా.. బ్లాక్ చేసేయ్..
ఇతరులకు అనుమానాస్పద లింకులు పంపుతున్నారని తేలినా సదరు అకౌంట్‌ను బ్లాక్ చేస్తామని వాట్సాప్ వెల్లడించింది. ‘టెపింగ్’ఇండికేటర్ కనిపించకుండా ఎవరి నుంచైనా సందేశాలు వచ్చిపడుతున్నట్టయితే, అలాంటి కాంటాక్టులను బ్లాక్ చేయడం మంచిదని తెలిపింది. తనదైన పరిశోధక విధానం ద్వారా అలాంటి వారి అకౌంట్లను నిషేధిస్తా మని కూడా ప్రకటించింది. ఒక అకౌంట్‌ను పలువురు బ్లాక్ చేసినా (నెగిటివ్ ఫీడ్‌బ్యాక్స్) సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపచేస్తామని తెలిపింది.
ఎఫ్‌బీలో పారదర్శక ప్రకటనలు..
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ ప్రకటనల విషయంలో పారదర్శకతతో కూడిన కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఫేస్‌బుక్(ఎఫ్‌బీ) ప్రకటించింది. ఎఫ్‌బీలో కనిపించే రాజకీయ ప్రకటన పేజీల బాధ్యులెవరు.. ఎక్కడ నుంచి వాటిని నిర్వహిస్తున్నారు.. వంటి విషయాలను తెలుసుకునేందుకు ఇవి వీలు కల్పిస్తాయని సంస్థ తెలిపింది. ప్రకటన మూలాలు గ్రహించేందుకు సాయపడతాయని వివరించింది. నిబంధనల్లో భాగంగా రాజకీయ ప్రకటనకు డిస్‌క్లయిమర్‌ను జోడిస్తారు. యూజర్లు దాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రకటన ఇచ్చిన వారి సమాచారం తెలుసుకునే వీలవుతుంది.2016 అమెరికా ఎన్నికల సందర్భంలో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ట్రంప్ కోసం పనిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కోవడం, ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం సేకరించి వాడుకోవడం తెలిసిందే.సమాచారం లీక్ అయిన విషయాన్ని అంగీకరించిన ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్.. డేటా రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఫేస్‌బుక్ విశ్వసనీయతను దెబ్బ తీసిన ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో పారదర్శకతతో కూడిన కొత్త ప్రమాణాలను ఆ సంస్థ నెలకొల్పింది. తాజాగా వాటిని భారత్‌కు కూడా వర్తింపచేయనుంది. ఈ నెల 21 నుంచి రాజకీయ ప్రకటనలపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment