తమిళనేత అకౌంట్‌లో భారీగా నల్లడబ్బు
పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా నల్లధనం బయటికి వస్తున్న సంగతి తెలిసిందే.
సాక్షి, చెన్నై : పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా నల్లధనం బయటికి వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక బినామి అకౌంట్‌లలో జమఅయిన బ్లాక్‌మనీ భరతం కూడా ఐటీ అధికారులు పడుతున్నారు. బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో తమిళనాడులో భారీగా నల్లధనం బయటికి వచ్చింది. ఓ ప్రముఖ తమిళనేత బినామి అకౌంట్‌లో రూ.246 కోట్ల బ్యాంకు డిపాజిట్‌ను ఐటీ అధికారులు గుర్తించారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు జరిగిన డీమానిటైజేషన్ కాలంలో ప్రముఖ తమిళనేత అకౌంట్‌లో ఇవి డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో 441 మంది ఖాతాదారులు బ్యాంకు డిపాజిట్లు రూ.240 కోట్లు కూడా వెలుగులోకి వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కస్టమర్ల వివరాలను మాత్రం బ్యాంకులు అందించలేకపోయాయి.
పెద్ద మొత్తంలో అనుమానిత లావాదేవీలు చేసిన 27,739 ఖాతాదారులకు కూడా ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీచేసినట్టు తెలిపింది. తాజాగా తమిళనేత బినామి అకౌంట్‌లో డిపాజిట్ అయిన రూ.246 కోట్ల బ్లాక్‌మనీ బ్యాంకింగ్ గంటల తర్వాత బ్యాంకు అకౌంట్‌లో జమఅయినట్టు ఐటీ చెప్పింది. డీమానిటైజేషన్ కాలంలో చేసిన అత్యధిక డిపాజిట్లలో ఇదీ ఒకటి. ఈ తమిళనేతకు తాము నోటీసు పంపామని, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో ఈ మొత్తాన్ని జమచేయడానికి అంగీకరించినట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తానికి పన్నులు, జరిమానా, పెనాల్టీ కూడా ఆయన కట్టడానికి సిద్దమైనట్టు తెలిసింది. ఆర్‌బీఐ అందించిన అనుమానిత డిపాజిట్ల ప్రకారం ప్రస్తుత ప్రక్రియ కొనసాగుతోంది. 27,739 మంది బ్యాంకు ఖాతాదారులకు ఐటీ అధికారులు నోటీసులు పంపారు. అయితే వీరిలో కేవలం 18,220 మంది మాత్రమే స్పందించినట్టు తెలిసింది.