విలీన ప్రక్రియ కొనసాగుతోంది: ఎస్బీఐ
నోట్ల రద్దు ప్రభావం ఉండదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ సరైన దిశలోనే కొనసాగుతోందని ఎస్‌బీఐ తెలిపింది. ప్రస్తుత నోట్ల రద్దు కార్యక్రమం వల్ల విలీనంలో ఎలాంటి జాప్యం ఉండదని స్పష్టం చేసింది. అధిక విలువ కలిగిన నోట్లను వెనక్కి తీసుకునే కార్యక్రమం కారణంగా విలీనంలో జాప్యం ఉంటుందా? అని సోమవారమిక్కడ విలేకరులు ఎస్‌బీఐ ఎండీ రజనీష్ కుమార్‌ను ప్రశ్నించగా... తాను అలా అనుకోవడంలేదన్నారు. ఆర్‌బీఐ ద్రవ్య విధానం గురించి మాట్లాడుతూ... వడ్డీ రేట్లను తగ్గించకుంటే అదే అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయంగా పేర్కొన్నారు. ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్‌ను తగ్గిస్తే ఆ మేరకు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తామని రజనీష్ చెప్పారు. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు, భారతీయ మహిళా బ్యాంకు ఎస్‌బీఐలో విలీనం అవుతున్న విషయం తెలిసిందే. తుది విలీన ప్రణాళికకు ఆర్‌బీఐ, ప్రభుత్వ ఆమోదం కోసం ఎస్‌బీఐ వేచి చూస్తోంది.
ఆర్‌బీఐ అదనపు సీఆర్‌ఆర్ తగ్గించాలి: ఎస్‌బీఐ అంతర్గత నివేదిక
బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక్కసారిగా వచ్చిన నగదును లాగేసేందుకు పెంచిన నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్) రిజర్వ్ బ్యాంక్ వెంటనే తగ్గించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని ఎస్‌బీఐ తన అంతర్గత నివేదిక ఎకోరాప్‌లో పేర్కొంది. సీఆర్‌ఆర్ అదనంగా పెంచడం వల్ల బ్యాంకులపై మరింత భారం పడుతోందని, ఇలాంటపుడు లిక్విడిటీని తగ్గించడం కోసం వ్యవస్థను కుదిపేయకుండా ఉండేటువంటి విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.