బ్యాంకింగ్ విలీనాలను ప్రోత్సహిస్తాం..
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
♦ భారత్‌కు ప్రపంచస్థాయి బ్యాంకింగ్ సంస్థలు అవసరం
♦ ప్రభుత్వ విధానం ప్రకారమే ఎస్‌బీఐ ‘విలీన’ ప్రక్రియ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో విలీన ప్రక్రియ ప్రభుత్వ విధానమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి బ్యాంకింగ్ సంస్థలు భారత్‌లో ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియ ప్రభుత్వ విధానం ప్రకారమే జరుగుతోందని అన్నారు. బ్యాంకింగ్ రంగం పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన ఇంద్రధనస్సు ప్యాకేజీలో బ్యాంకింగ్ విలీనం కూడా ఒక భాగమని అన్నారు. ఫిబ్రవరి బడ్జెట్‌లోనూ బ్యాంకింగ్ విలీన అవసరాన్ని పేర్కొన్నట్లు ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రభుత్వ రంగంలో అనేక బ్యాంకులు అవసరమా? అన్న ప్రశ్న గురించి తాను ఆలోచిస్తుంటానని అన్నారు.
బ్యాంకుల సంఖ్య తగ్గాల్సి ఉందనీ ఈ సందర్భంగా అన్నారు. ఎస్‌బీఐతో బ్యాంకుల విలీనానికి సంబంధించిన ప్రతిపాదన తమ వద్దకు వచ్చినప్పుడు దీనిని చాలా సానుకూల అంశంగానే పరిశీలిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. అయితే అదే సందర్భంలో ఏదైనా బ్యాంక్ తన సొంత అభిప్రాయాన్ని వెల్లడిస్తే.. ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఎస్‌బీఐ విలీన ప్రక్రియ నేపథ్యంలో అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) మంగళవారం ఒక ప్రకటన చేస్తూ... అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో కాకుండా, తమలో తాము ఒకటిగా విలీనం కావాలని ఈ ఏడాది మార్చి 23, ఏప్రిల్ 25వ తేదీల్లో సంఘం ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారని తెలిపింది. . ఆర్థికమంత్రి అభిప్రాయాలను సైతం పట్టించుకోకుండా తనలో విలీనమయ్యేలా ఐదు అనుబంధ బ్యాంకులపై ఎస్‌బీఐ ఒత్తిడి తెచ్చినట్లు కనబడుతోందని విమర్శించింది. ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియపై జైట్లీ ఒక స్పష్టమైన ప్రకటన చేయడం గమనార్హం.
తక్షణ దృష్టి ఎన్‌పీఏల పరిష్కారమే...
విలీనానికి మరిన్ని బ్యాంకులు ముందుకు వచ్చే వీలుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్ రుణ బకాయిల పరిష్కారమే ప్రస్తుత ప్రధాన ధ్యేయమని అన్నారు. బ్యాంకుల పటిష్టత, లాభదాయకతలు ప్రభుత్వ ప్రధాన ద్యేయమని తెలిపారు. అటు తర్వాతే విలీన ప్రక్రియ గురించి పూర్తిస్థాయిలో ఆలోచించడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మెజారిటీ వాటాల విక్రయ ప్రణాళికలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, నీతి ఆయోగ్ సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.