
ఈవెంట్ ప్లానింగ్ ఇక ఆన్‌లైన్‌లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లి, గృహ ప్రవేశం, పుట్టినరోజు, షష్టిపూర్తి.. ఇలా వేడుక ఏదైనా ఫంక్షన్ హాల్ మొదలుకుని క్యాటరర్స్‌ను ఎంపిక వరకు పెద్ద ప్రహసనమే. వేడుకలో ఎంజాయ్ చేయాల్సిన తరుణంలో ఈ ఏర్పాట్లలో తలమునకలయ్యే కుటుంబ సభ్యులే ఎక్కువ . వేరే ఊర్ల నుంచి వచ్చి స్థిరపడ్డవారు, ప్రవాస భారతీయులకైతే కార్యక్రమ ఏర్పాట్లు తలకు మించిన భారమే. ఇక అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా ఆ బాధ చెప్పతరం కాదు.
ఈ ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఈవెంట్ ప్లానింగ్ అం తా ఆన్‌లైన్‌లో చేసుకుని మధుర క్షణాలను ఆస్వాదించమటోంది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ యువర్‌ఈవెంట్.కో. ఒక్క క్లిక్‌తో కావాల్సిన హాల్, ఫోటోగ్రాఫర్, డెకోరేటర్, క్యాటరర్‌ను ఎంచుకోండని చెబుతోంది. హైదరాబాద్‌లో వచ్చిన స్పందనతో ఇతర నగరాలకూ విస్తరించేందుకు ఈ స్టార్టప్ సమాయత్తమవుతోంది.
అనుభవ ం నేర్పిన పాఠం..
అది 2008. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో వార్షికోత్సవ వేడుక. ఉన్న బడ్జెట్‌లో సౌండ్ సిస్టమ్, లైట్లు ఏర్పాటు చేసేవారి కోసం చాలా వెతికాం. చివరకు ఎలాగోలా పట్టుకోగలిగాం. స్నేహితుడి పెళ్లి సందర్భంగానూ ఇలాంటి అనుభవమే. క్యాటరర్, ఫోటోగ్రాఫర్‌ను ఎంచుకోవడానికి స్నేహితులు, బాగా తెలిసిన వారి సహాయం తీసుకున్నాం. నమ్మకమైన వెండార్లను పట్టుకోవడానికి స్నేహితులో లేదా పాత పరిచయాలపై ఆధారపడుతున్నాం.
ఈ అనుభవమే కంపెనీ ఏర్పాటుకు దారి తీసిందని అంటున్నారు యువర్‌ఈవెంట్.కో సహ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీహర్ష భవిరిశెట్టి. వేడుకలో ఎంజాయ్ చేయాల్సిందిపోయి కార్యక్రమం ఎలా జరుగుతుందోనన్న బెంగ చాలా మందిలో ఉంటుందని అన్నారాయన. నమ్మకమైన వెండార్లను, అందులోనూ ఆన్‌లైన్‌లో క్షణాల్లో బుక్ చేసుకునే వ్యవస్థ ఉంటే పెద్ద ఊరటేనని చెప్పారు.
బ్యాక్‌గ్రౌండ్ చూశాకే..
ఈవెంట్‌తో ముడి పడి ఉన్న వెండార్లందరినీ వెబ్‌సైట్లోకి తీసుకురావడం లేదు. వెండార్ల బ్యాక్‌గ్రౌండ్ చూసి కస్టమర్లకు మంచి సర్వీసు ఇస్తార ని విశ్వసించాకే ఎంపిక చేసుకుంటున్నాం. కస్టమర్ల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నదే మా లక్ష్యం అని శ్రీహర్ష తెలిపారు. ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్‌లైన్ సర్వీసులకే యూత్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
ఇతర ఊర్లు, ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు... అలాగే ప్రవాస భారతీయులకు యువర్‌ఈవెంట్.కో చక్కని వేదిక అని చెప్పారు. వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్న వారిలో 20 శాతంపైగా ఎన్నారైలు ఉంటున్నారని వివరించారు. ఎన్నారైలు ఒకట్రెండు వారాలు ఇక్కడ ఉండి వేడుక జరుపుకుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారికి ఒక క్లిక్ దూరంలోనే సర్వీసులు ఉండడం ప్రయోజనమని అన్నారు.
ఎంపిక అంతా మీ ఇష్టం..
వివిధ సర్వీసులు ఇచ్చే వెండార్ల వివరాలు అంటే హోటళ్లు, ఫోటోగ్రాఫర్లు, క్యాటరర్ల వంటివారి సమాచారం అంతా వెబ్‌సైట్లో పొందుపరిచారు. హోటల్ సామర్థ్యం, ప్రదేశం, చార్జీలు తదితర వివరాలూ ఉంటాయి. కస్టమర్ తన బడ్జెట్, వచ్చే అతిథుల సంఖ్యను టైప్ చేస్తే చాలు అందుకు అనుగుణంగా సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఇప్పటివరకు 350కి పైగా వెండార్లతో కంపెనీ చేతులు కలిపింది. వెండార్ల నుంచి కస్టమర్లు కొటేషన్ కోరి బెస్ట్ డీల్స్ పొందొచ్చు. చెల్లింపులన్నీ నేరుగా వెండార్లకే చేయాలి. కస్టమర్లు వెబ్‌సైట్‌ను సందర్శించడం, వెండార్లతో లావాదేవీల వివరాలను ట్రాక్ చేసే వ్యవస్థ కంపెనీ వద్ద ఉంది. ఎంత సీజన్ ఉన్నా వెండార్ల తొలి ప్రాధాన్యత తమ కస్టమర్లేనని కంపెనీ అంటోంది.