Revanth Reddy Arrested: TPCC chief Ahead Of Protest Call In View of CM KCR Birthday - Sakshi
Sakshi News home page

ఎక్కడికక్కడ కట్టడి 

Published Thu, Feb 17 2022 12:51 PM | Last Updated on Fri, Feb 18 2022 2:09 AM

Revanth Reddy Arrested Ahead Of Protest Call In View of CM KCR Birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ బంజారాహిల్స్‌/ గోల్కొండ: సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిరుద్యోగ ఆందోళనలకు పిలుపు నిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలను పోలీసులు అరెస్టులు, హౌస్‌ అరెస్టులతో ఎక్కడికక్కడ కట్టడి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నివాసాన్ని గురువారం ఉదయమే పోలీసులు చుట్టుముట్టారు. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు బయలుదేరిన రేవంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్‌ను అరెస్టు చేసిన పోలీసులు గోల్కొండ పీఎస్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. 

ముఖ్యనేతల్ని కూడా.. 
రేవంత్‌తో పాటు  మహిళా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సునీతారావు, శివసేనారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులను హౌస్‌ అరెస్టు చేశారు. ఇతర జిల్లాల్లోనూ పలువురు నేతలను అదుపులోనికి తీసుకున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు గాడిదల ముందు కేక్‌లు కట్‌ చేశారు. నిరుద్యోగ యువతను కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

నక్సలైట్లు ఉంటేనే బాగుండనిపిస్తోంది..
గోల్కొండ పీఎస్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఫిబ్రవరి 17ను నిరుద్యోగ దినంగా జరుపుతామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్‌ ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో పీజీలు చదివిన వారు కూడా హమాలీలుగా మారిపోయారని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వ తీరు చూస్తుంటే నక్సలైట్లు ఉంటేనే బాగుండుననిపిస్తోందన్నారు.  ప్రముఖులు చనిపోతే మూడు లేదా వారం రోజులు సంతాపదినాలు జరుపుతారని, బతికి ఉన్న నాయకుడి పుట్టినరోజును మూడు రోజులు జరుపుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి బానిసలుగా వ్యవహరిస్తున్న పోలీసుల సంగతి తేలుస్తామని రేవంత్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ శ్రేణులు తమ నిరసనలు కొనసాగించాలని, మెగా నోటిఫికేషన్ల డిమాండ్‌తో అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.  

చదవండి: ‘తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ముందా.. సవాల్ చేస్తున్నా’

కోస్గిలో బాహాబాహీ 
కోస్గి:  రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో, కోస్గి మండల కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి. కోస్గి పట్టణంలో రెండు పార్టీల నాయకులు నాయకులు బాహాబాహీకి దిగారు. వివరాలిలా ఉన్నాయి. కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సమక్షంలో గురువారం సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటికే కాంగ్రెస్‌ నాయకులు గాడిదకు కేసీఆర్‌ చిత్రపటం తగిలించి కేక్‌ కోసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై దాడికి యత్నించారు. ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకోవడంతో పాటు, రాళ్లు రువ్వుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. పోలీసుల వాహనం ఒకటి దెబ్బతినగా.. డ్రైవర్‌ బషీర్‌కు  గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ నాయకులు చెక్‌పోస్ట్‌ సమీపంలో పార్టీ నాయకుడు నాగులపల్లి నర్సింహులు ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రాళ్లతో ఆ ఇంటిపై దాడి చేశారు. డీఎస్పీ మధుసూదన్‌రావుతో పాటు నలుగురు సీఐలు, ఎస్‌ఐలు ప్రత్యేక బలగాలతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అక్కడి నుంచి మద్దూరు స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  
చదవండి: రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement