పన్ను చెల్లింపుదార్ల కోసం ఐటీ యాప్
న్యూఢిల్లీ: పన్నుల చెల్లింపులు, పాన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన వాటిని మరింత సులభతరం చేసేలా ఆదాయ పన్ను శాఖ తాజాగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆదాయ పన్ను శాఖకు, అసెసీలకు మధ్య వారధిలా ఉపయోగపడేలా రూపొందించిన ఈ ’ఆయకర్ సేతు’ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది పనిచేస్తుంది. పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు.
దీనితో పన్నుల చెల్లింపులు, పర్మనెంట్ అకౌంటు నంబరుకు దరఖాస్తు చేయడం, పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటి పనులను ఎవరి సహాయం అవసరం లేకుండా ఇంటి వద్ద కూర్చునే అసెసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే కాకుండా 7306525252కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో యాప్ ద్వారానే ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఆప్షన్‌ను కూడా సీబీడీటీ అందుబాటులోకి తేనుంది. పన్నుల చెల్లింపునకు సంబంధించిన కీలకమైన తేదీలు, ఫారమ్‌లు, నోటిఫికేషన్స్ మొదలైనవి రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఐటీ శాఖ పంపనుంది. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు కావాలనుకునే వారు ఆయకర్ సేతు మాడ్యూల్‌లో తమ మొబైల్ నంబర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.