పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంక్.. బేస్‌రేట్ కోత
న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్ రేటు) తగ్గింపు బాటలో బుధవారం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఐడీబీఐ బ్యాంక్‌లూ నడిచాయి. ఈ రేటును పావుశాతం తగ్గించాయి. దీనితో రెండు బ్యాంకులకు సంబంధించీ ఈ రేటు 10 శాతానికి తగ్గింది. పీఎన్‌బీ రేటు కోత మే 7 నుంచీ అమల్లోకి వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ తాజా బేస్‌రేటు మే 11 నుంచీ అమల్లోకి వస్తుంది. బ్యాంకుల నిర్ణయం వల్ల బేస్ రేటుతో అనుసంధానమయ్యే గృహ, వాహన ఇతర రుణాలపై వడ్డీరేట్లు (ఈఎంఐ) తగ్గే అవకాశం ఉంది. కాగా ఐడీబీఐ బ్యాంక్ తన రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లనుకూడా కొన్ని మెచ్యూరిటీలపై 0.10 నుంచి 0.25 శాతం శ్రేణిలో తగ్గించింది.
ఈ తాజా రేట్లు కూడా మే 11 నుంచీ అమల్లోకి వస్తాయి. రుణ రేటు తగ్గింపు డిపాజిట్ రేటు తగ్గింపునకూ సంకేతం. రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5%) తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెస్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.
ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌సహా పలు బ్యాంకులు రుణ రేటును 0.15% నుంచి 0.25% వరకూ తగ్గించాయి. జనవరి నుంచీ ఆర్‌బీఐ కీలక పాలసీ రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది.