సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ను మరింత విస్తృతిలోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అన్నింటికీ దీన్ని ఆధారం చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతం 12 అంకెల ఈ ఆధార్‌ను అన్ని పోస్టు ఆఫీసు డిపాజిట్లకు, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్, కిషాన్ వికాస్ పాత్రలకు తప్పనిసరి చేసింది. ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను సమర్పించడానికి 2017 డిసెంబర్ 31ను తుది గడువుగా విధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన నాలుగు గెజిట్ నోటిఫికేషన్లలో ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
పోస్టు ఆఫీసుల్లో డిపాజిట్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్‌ను సమర్పించని వారు, ప్రస్తుతం ఆధార్ నెంబర్‌ను సంబంధిత పోస్టు ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు లేదా డిపాజిట్ ఆఫీసు వద్ద సమర్పించాలని ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. అన్ని బ్యాంకు డిపాజిట్లకు, మొబైల్ ఫోన్ సిమ్‌లకు, పలు ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలకు ఆధార్‌ను సమర్పించే గడువును సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఆధార్ అన్నింటికీ తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆధార్ నెంబర్ లేని వాళ్ల కోసం ప్రభుత్వం ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను కూడా తెరచింది. 2017 డిసెంబర్ 31 వరకు వారు ఆధార్‌ను ఎన్‌రోల్ చేసుకుని, ఈ నెంబర్‌ను పొందాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment