
ఉచితంగా యాంటీ–వైరస్ టూల్స్
‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ను ప్రారంభించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: సైబర్ దాడుల నుంచి కంప్యూటర్/ల్యాప్‌టాప్/మొబైల్ ఫోన్‌ను రక్షించుకునేందుకు మీరు ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్ లేదా సైబర్ స్వచ్ఛత కేంద్ర వెబ్‌సైట్ (www.cyberswachhtakendra.gov.in) నుంచి ఉచితంగా ప్రభుత్వం రూపొందించిన ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సైబర్ దాడుల బెడద రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సాయంతో ‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ ద్వారా కొత్త డెస్క్‌టాప్ అండ్ మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వీటిల్లో వైరస్, మాల్వేర్‌ను విశ్లేషించే యాప్‌సంవిద్/యాప్‌వైట్ లిస్టింగ్, యూఎస్‌బీ ప్రతిరోద్ అనే టూల్స్ ఉన్నాయి. వీటిని సి–డాక్ అభివృద్ధి చేసింది. యూఎస్‌బీ ప్రతిరోద్ అనేది పోర్టబుల్ యూఎస్‌బీ స్టోరేజ్ పరికరాల అనధికార వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఇక యాప్‌సంవిద్ టూల్ విండోస్ పీసీలపై పనిచేస్తుంది. ఇది ముందస్తు అనుమతి ఉన్న యాప్స్, ఫైల్స్‌ను మాత్రమే అనుమతిస్తుంది. మిగతా అన్ని వైరస్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తుంది. ఇక్కడ ఇంకొక ‘ఎం–కవచ్’ టూల్ ఉంది. మొబైల్ ఫోన్ల భద్రతే లక్ష్యంగా దీన్ని తీసుకువచ్చారు. కాగా ఈ సొల్యూషన్స్ అన్నీ ఉచితం.
‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో రూ.90 కోట్లు వెచ్చిస్తామని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘దేశీ సైబర్ సెక్యూరిటీ నియంత్రణ సంస్థ కర్టిన్.. ప్రభావితమైన సిస్టమ్స్ డేటాను సేకరించి దాన్ని ఐఎస్‌పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్), బ్యాంక్‌లకు చేరవేస్తుంది. అప్పుడు ఇవి.. యూజర్‌ను గుర్తించి వారికి ఒక లింక్‌ను పంపిస్తాయి. దానిపై క్లిక్ చేసి యాంటీ–వైరస్/యాంటీ–మాల్వేర్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని వివరించారు.
ప్రస్తుతం 58 ఐఎస్‌పీలు, 13 బ్యాంకులు ఈ వ్యవస్థను ఉపయోగించడానికి ముందుకొచ్చాయని తెలిపారు. నేషనల్ సైబర్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీసీసీ)ని జూన్ నాటికి ఏర్పాటు చేయాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను ఆదేశించామన్నారు. కేంద్రం దీనికోసం రూ.900 కోట్ల నిధులను కేటాయించింది. ఇది దేశీ ఇంటర్నెట్ వ్యవస్థపై జరిగే సైబర్ దాడులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను రాష్ట్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.