న్యూఢిల్లీ: కడపలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు కానున్నది. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చే నిమిత్తం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ), దాల్మియా భారత్ ఫౌండేషన్‌లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రానున్న పదేళ్లలో దాదాపు 60,000 మంది నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తామని ఎన్‌ఎస్‌డీసీ తెలిపింది. వస్త్రాలు, రిటైల్, ఆటో, హెల్త్‌కేర్, రియల్టీ, వ్యవసాయం తదితర రంగాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొంది. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిలో 70 శాతం మందికి తప్పక ఉపాధి కల్పిస్తామని ఎన్‌ఎస్‌డీసీ సీఈవో జయంత్ కృష్ణా తెలిపారు.
మొత్తంగా తమిళనాడు (తిరుచ్చి), ఆంధ్రప్రదేశ్ (కడప), కర్నాటక (బెల్గామ్), ఉత్తరప్రదేశ్ (సీతాపూర్), అస్సాం (గువాహటి), ఒడిస్సా (రూర్కెలా, కటక్), జార్ఖండ్ (బొకారొ) ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని దాల్మియా భారత్ గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ గౌతమ్ దాల్మియా తెలిపారు.