ఎన్‌టీపీసీ ఆఫర్ తో ఖజానాకు రూ. 5 వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)కి రూ. 5,030 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూలో మూడింట రెండొంతుల షేర్లను బీమా సంస్థలు దక్కించుకున్నాయి. సింహభాగం షేర్లకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ), బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, సంపన్న ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు వచ్చాయి. అయితే, స్టాక్ మార్కెట్ల క్షీణత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది.
సంస్థాగత ఇన్వెస్టర్లు తమకు కే టాయించిన షేర్లకు రెట్టింపు బిడ్లు దాఖలు చేశారు. మార్కెట్లు స్థిరంగా ఉన్న పక్షంలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా మంచి స్పందనే వచ్చి ఉండేదని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం కార్యదర్శి నీరజ్ కే గుప్తా తెలిపారు. దాదాపు 63 శాతం షేర్లను ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసీ సహా ఇతర బీమా కంపెనీలు దక్కించుకున్నాయి. చిన్న ఇన్వెస్టర్ల కోసం ఇష్యూలో 20 శాతం కేటాయించగా అందులో 8.5 శాతం షేర్లకు బిడ్లు వచ్చాయి. వీరికి 8.24 కోట్ల షేర్లు కేటాయించగా, 3.63 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్లు (44.11)దాఖలయ్యాయి.
డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఎన్‌టీపీసీలో 5 శాతం వాటాలను (41.22 కోట్ల షేర్లు) ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయానికి ఉంచింది. ఇందుకు షేరు ఒక్కింటికి రూ. 122 ధర నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5% అదనంగా డిస్కౌంటునిచ్చింది. తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్లకు 32.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా, రెండో రోజున రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 8.24 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది. నాన్ రిటైల్ కేటగిరి విభాగానికి షేరు ఒక్కింటి ధరను రూ. 122.05గా నిర్ణయించింది. 5% వాటాల విక్రయానంతరం ఎన్‌టీపీసీలో ప్రభుత్వానికి 69.96% వాటాలు ఉంటాయి. బుధవారం ఎన్‌టీపీసీ షేరు ధర ఆఫర్ ధర కన్నా క్షీణించి బీఎస్‌ఈలో 4.2% తగ్గుదలతో రూ. 118.70 వద్ద ముగిసింది.