‘క్రూడ్‌’ కల్లోలం! | Oil prices boosted by US-Iran tensions | Sakshi
Sakshi News home page

‘క్రూడ్‌’ కల్లోలం!

Published Tue, Jan 7 2020 4:53 AM | Last Updated on Tue, Jan 7 2020 5:09 AM

Oil prices boosted by US-Iran tensions - Sakshi

ఇరాన్‌–అమెరికా మధ్య భీకర పరస్పర ప్రతిజ్జలు కొనసాగుతున్నాయి. ఫలితం... ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగభగమన్నాయి. మన మార్కెట్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. నష్ట భయం అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు సురక్షిత సాధనాలైన పుత్తడి, జపాన్‌ కరెన్సీ యెన్‌లవైపు తరలిపోతుండటంతో  రూపాయి 72ను సైతం తాకింది. అంతర్జాతీయంగా పుత్తడి పరుగులు పెట్టింది. దేశీయంగా పసిడి ధర ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఎగిసింది.  

పశ్చిమాసియాలో అమెరికా రాజేసిన యుద్ధభయాలతో స్టాక్‌ మార్కెట్లు వణికిపోతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరగడం నష్టాలకు మరింత ఆజ్యం పోసింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 41 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 851 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్‌ చివరకు 788 పాయింట్ల నష్టంతో 40,677 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 234 పాయింట్లు పతనమై 11,993 వద్దకు చేరింది. నిఫ్టీ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఆరు నెలల కాలంలో ఇదే ప్రథమం. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.  

పరస్పర హెచ్చరికలు.....
ఇరాన్‌ సైనిక కమాండర్‌ ఖాసీమ్‌ సులేమానీని గత శుక్రవారం బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్‌ దాడిలో చంపేసిన విషయం తెలిసిందే. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. 2015 నాటి అణ్వస్త్ర ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు కూడా ప్రకటించింది. అంతే కాకుండా ఇరాన్‌లో ఉన్న అమెరికా దళాలను ఉపసంహరించాలని ఇరాన్‌ పార్లమెంట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు ప్రతీకార దాడులకు దిగితే అంతకు మించిన దాడులు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధిస్తామని కూడా ఆయన బెదిరించారు. ఇరు దేశాల భీషణ ప్రతినల నడుమ ముడిచమురు ధరలు భగ్గుమనగా, ప్రపంచ మార్కెట్లు వణికిపోయాయి.  

షేర్ల తీరు ఇలా.....
► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో రెండు షేర్లు–టైటాన్, పవర్‌ గ్రిడ్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి.  

► బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 4.6 శాతం నష్టంతో రూ.3,938 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► ముడిచమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్, విమానయాన రంగ షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్‌ 7 శాతం, ఐఓసీ 1.5 శాతం, బీపీసీఎల్‌ 2.7 శాతం చొప్పున క్షీణించాయి.  

► టైర్లు, పెయింట్ల షేర్లు కూడా నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్, అపోలో టైర్స్, ఎమ్‌ఆర్‌ఎఫ్, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 1–4% నష్టపోయాయి.  

► బీఎస్‌ఈలో ట్రేడైన ప్రతి ఐదు షేర్లలో సగటున 4 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 200కు పైగా షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకాయి.  

► రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2–3% నష్టపోయాయి.  సెన్సెక్స్‌ మొత్తం 788 పాయింట్ల నష్టంలో ఈ 3 షేర్ల వాటా  330 పాయింట్ల మేర ఉంది.  

► సౌత్‌ అమెరికన్‌ సినర్జీ గ్రూప్‌ వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతోందన్న వార్తలతో ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ.36 వద్ద ముగిసింది.


రెండు రోజుల్లో రూ. 3.36 లక్షల కోట్లు ఆవిరి
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో మన మార్కెట్‌ నష్టపోయింది. గత శుక్రవారం 162 పాయింట్లు, ఈ సోమవారం 788 పాయింట్లు చొప్పున సెన్సెక్స్‌ పతనమైంది. ఈ నష్టాల కారణంగా రూ.3.36 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఈ రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.3.37 లక్షల కోట్లు ఆవిరై రూ.153.9 లక్షల కోట్లకు తగ్గింది.

ప్రపంచ మార్కెట్లలో భయం...
అమెరికా– ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ మార్కెట్లు భయపడుతున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ విశ్లేషకులు వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. ప్రపంచ పరిస్థితులు అస్థిరంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఉన్న తమ పొజిషన్లను స్క్వేరాఫ్‌ చేసుకొని సురక్షిత పెట్టుబడుల సాధనాల దిశగా మళ్లిస్తున్నారని వివరించారు.  

భారత్‌పై ప్రభావం అధికం...
ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇతర వర్ధమాన దేశాల కంటే కూడా భారత్‌పైనే అధికంగా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు వినియోగదేశమైనప్పటికీ, మన అవసరాలకు మూడో వంతుకు పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని,  చమురు ధరలు పెరిగితే అది మన ఖజానాపై తీవ్రంగానే ప్రభావం చూపగలదని వారంటున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయి దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని, ఇది ప్రభుత్వవ్యయంపై ప్రభావం చూపుతుందనేది నిపుణుల ఆందోళన.

బడ్జెట్‌ ర్యాలీ అనుకుంటే, భారీ నష్టాలు....
ఏడాది కాలం పాటు మన మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లపై అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రంగానే ప్రభావం చూపాయి. ఇటీవలే ఇరు దేశాలు తొలి దశ ఒప్పందానికి అంగీకరించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. మరో నెలలో రానున్న బడ్జెట్‌లో కేంద్రం మరిన్ని తాయిలాలిస్తుందనే ఆశలతో బడ్జెట్‌ ర్యాలీ కొనసాగుతుందని అంతా అంచనా వేశారు. హఠాత్తుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లడంతో గత రెండు రోజులుగా మన మార్కెట్‌ కుదేలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement