
ప్రతీకాత్మక చిత్రం
బెంగుళూరు : క్యాబ్ సేవల సంస్థ ఓలా తన కస్టమర్లకు రెండు రైడ్లు ఉచితంగా ఇస్తున్నట్లు బుధవారం తెలిపింది. కానీ అది మన ఇండియాలో కాదు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవలే ఇండియాకు చెందిన ఓలా సంస్థ తన క్యాబ్ సేవలను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్ నగరాలలో ప్రారంభించిన సంగతి తెల్సిందే.
ట్రయల్‌లో భాగంగా పది డాలర్ల వరకు రెండు సార్లు ఉచితంగా తమ క్యాబ్‌లలో ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రయాణికులకు తక్కువ చార్జీలు, డ్రైవర్లకు అధిక లాభంతో నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని ఓలా ప్రకటించింది.
తమ సర్వీస్‌ను అభివృద్ధి పరుచుకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కస్టమర్లను కోరింది. సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్ నగరాల్లోని ప్రైవేటు అద్దె వాహనాల యజమానులు కంపెనీ వెబ్‌సైట్ drive.olacabs.comలో రిజిస్టర్ చేసుకోవచ్చునని తెలిపింది.