సాక్షి, బిజినెస్ డెస్క్: పాత డెబిట్ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. ప్రస్తుతం విరివిగా వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ (మ్యాగ్‌స్ట్రిప్) డెబిట్ కార్డులు.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 తర్వాత నుంచి చెల్లుబాటు కావు. జనవరి 1 నుంచి యూరో పే, మాస్టర్‌కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త కార్డులను పంపిస్తున్నాయి. అయినప్పటికీ.. సుమారు 70 శాతం మంది ఖాతాదారులకు మాత్రమే ఇవి చేరినట్లు తెలుస్తోంది. దీంతో తప్పనిసరిగా చిప్ కార్డులు తీసుకోవడంపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికీ చిప్ కార్డు పొందని వారు ఆఖరు రోజు దాకా వేచి చూడకుండా.. సత్వరం తమ తమ బ్యాంకు శాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాయి. ఉదాహరణకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ తీసుకుంటే.. ఇందులో ఈ–సర్వీసెస్ విభాగంలో ఏటీఎం కార్డు సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త కార్డుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాత మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులను ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ వంటి బ్యాంకులు చాలామటుకు ఉచితంగానే అందిస్తున్నాయి. మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తున్నవారి చిరునామాలకు నేరుగా పంపిస్తున్నాయి. ఒకవేళ గడిచిన ఏడాదికాలంగా ఒక్కసారి కూడా కార్డును ఉపయోగించని వారు మాత్రం తమ తమ హోం బ్రాంచీల్లో సంప్రదించి కొత్త చిప్ కార్డులను పొందవచ్చని ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి.
99 కోట్ల డెబిట్ కార్డులు..
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 99 కోట్ల డెబిట్ కార్డులు, 4.2 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఖాతాదారులు మోసాల బారిన పడకుండా కాపాడే క్రమంలో 2015 సెప్టెంబర్ నుంచే చిప్ ఆధారిత, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్(పిన్)తో పనిచేసే డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయాలంటూ అదే ఏడాదిలో ఆర్‌బీఐ ఆదేశించింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను మరికొన్ని నెలలు పాటు పొడిగించడంతో 2016 జనవరి తర్వాత నుంచి కొత్తగా ఖాతాలు తెరిచిన వారందరికీ చిప్ ఆధారిత డెబిట్ కార్డులనే బ్యాంకులు జారీ చేస్తున్నాయి. కానీ, డెడ్‌లైన్ కన్నా ముందే మ్యాగ్‌స్ట్రిప్‌తో జారీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డులు యథాప్రకారం వాడకంలో కొనసాగుతున్నాయి. దీంతో వీటన్నింటి స్థానంలో కొత్త చిప్ కార్డులు జారీ చేయాలం టూ ఈ ఏడాది డిసెంబర్ 31ని ఆర్‌బీఐ డెడ్‌లైన్‌గా విధించింది. దీన్ని పొడిగించాలం టూ బ్యాంకులు కోరినప్పటికీ.. ఆర్‌బీఐ తోసిపుచ్చడంతో గడువులోగా చిప్‌కార్డుల జారీ అనివార్యమైంది.
ఈఎంవీ చిప్ కార్డు అంటే..
డెబిట్ కార్డు చెల్లింపులకు సంబంధించి ఈఎంవీ చిప్ టెక్నాలజీని అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణిస్తారు. ఈ టెక్నాలజీ గల డెబిట్ కార్డుల్లో పొందుపర్చే మైక్రోప్రాసెసర్ చిప్‌లో.. కార్డుహోల్డరు డేటా భద్రంగా నిక్షిప్త మై ఉంటుంది. అయితే, స్వైప్ చేసిన ప్రతిసారి ఆథెంటికేషన్ వివరాలు మారిపోతూ ఉంటా యి. పిన్ నంబరు కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే.. రెండంచెల భద్ర త ఉంటుంది. దీంతో ఈ కార్డుల నుంచి డేటా సేకరించడం, క్లోనింగ్ చేయడం, మోసగిం చడం చాలా కష్టం. మ్యాగ్‌స్ట్రిప్ కార్డులతో పోలిస్తే ఇది మరింత సురక్షితమైన టెక్నాలజీ.
మ్యాగ్‌స్ట్రిప్ కార్డు గుర్తింపు ఇలా
డెబిట్ కార్డు ముందుభాగంలో ఎడమవైపున చిప్ లాంటిది గానీ లేకపోతే మీది పాత మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డు అవుతుంది. సాధారణంగా మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల్లో కస్టమర్ డేటా స్థిరంగా నిక్షిప్తమైపోతుంది. దీంతో మోసగాళ్లు ఈ వివరాలను సులభతరంగా సేకరించి, మోసాలకు పాల్పడేందుకు ఆస్కారాలు ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment