కాకినాడ ఓఎన్‌జీసీ క్రాకర్‌ యూనిట్‌పై నీలినీడలు | ONGC CMD Sashishankar about cracker unit | Sakshi
Sakshi News home page

కాకినాడ ఓఎన్‌జీసీ క్రాకర్‌ యూనిట్‌పై నీలినీడలు

Published Wed, May 23 2018 12:26 AM | Last Updated on Wed, May 23 2018 12:26 AM

ONGC CMD Sashishankar about cracker unit - Sakshi

సాక్షి, అమరావతి :  కాకినాడలో రూ.40,000 కోట్లతో హెచ్‌పీసీఎల్, గెయిల్‌తో కలసి ఏర్పాటు చేయదల్చిన క్రాకర్‌ యూనిట్‌ ఆర్థికంగా లాభసాటి కాదన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటున్నారు ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ సీఎండీ శశి శంకర్‌.

నాగాయలంక బావుల నుంచి గ్యాస్, చమురును వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి వచ్చిన శశిశంకర్‌ ‘సాక్షి’తో మాట్లాడారు. కేజీ బేసిన్‌లో పెట్టుబడుల దగ్గర నుంచి సామాజిక కార్యక్రమాల వరకు పలు అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ప్రత్యేకంగా..

రాష్ట్రంలో పెట్టుబడుల విస్తరణ గురించి వివరిస్తారా?
ఓఎన్‌జీసీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. కేజీ బేసిన్‌లో ఆఫ్‌షోర్‌ బావి కేజీ డబ్ల్యూఎన్‌ 98/2 ఒక్కదానిపైనే సుమారుగా రూ. 35,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి.  అదే విధంగా నాగాయలంక బ్లాక్‌లో రూ. 2,800 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేశాం.

ఇవి కాకుండా గడిచిన ఒక్క ఏడాదే 22 బావులను తవ్వాము. వచ్చే మూడేళ్లలో సహజవాయువు ఉత్పత్తిని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్‌ కీలకపాత్ర పోషించనుంది. మూడేళ్లలో గ్యాస్‌ ఉత్పత్తిని 24 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నుంచి 50 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

కాకినాడలో క్రాకర్‌ ప్రాజెక్టు ప్రతిపాదన ఎంత వరకు వచ్చింది?
గెయిల్, హెచ్‌పీసీఎల్‌తో కలసి రూ. 40,000 కోట్లతో క్రాకర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవు. ప్రారంభంలో వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ గురించి ఆలోచించినా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభమా కాదా అన్నదానిపై ఇంకా చర్చిస్తున్నాం. ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

ఓఎన్‌జీసీ హెచ్‌పీసీఎల్‌ విలీనంపై...
ఓఎన్‌జీసీలో హెచ్‌పీసీఎల్‌ విలీన ప్రతిపాదనను ఆపేశాము. చమురు ఉత్పత్తికి..విక్రయించే రిటైల్‌ సంస్థల వ్యాపారానికి చాలా తేడా ఉంది. అందుకే మా గ్రూపునకు చెందిన రిఫైనరీ, రిటైల్‌ సంస్థ ఎంఆర్‌పీఎల్‌ను హెచ్‌పీసీఎల్‌లో విలీనం చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయంగా చాలా దేశాల్లో కూడా చమురు ఉత్పత్తి సంస్థలు రిటైల్‌ వ్యాపారాన్ని వేరే సంస్థ ద్వారా చేస్తున్నాయి. మేము కూడా ఇక్కడే అదే విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నాం.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి...
రాష్ట్రం నుంచి వస్తున్న లాభాల్లో రెండు శాతం కంటే ఎక్కువగానే సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో సామాజిక కార్యక్రమాల కోసం రూ. 67 కోట్లు వ్యయం చేశాము. ఈ కార్యక్రమం కింద 4,500 మరుగుదొడ్లు నిర్మించాం.

గతేడాది రాజమండ్రి ఆన్‌సైట్‌ నుంచి ఓఎన్‌జీసీకి రూ. 306 కోట్ల లాభం వచ్చింది. అయినా ఆన్‌సైట్‌ యూనిట్‌ ఏకంగా రూ. 18 కోట్లు సామాజిక కార్యక్రమాలకు, మరో రూ. 14 కోట్లు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల కింద వినియోగించాం. ఇవన్నీ మా సైట్లు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులకు అదనం. ఈ మౌలిక వసుతల కల్పనను నిర్వహణ వ్యయం కిందే పరిగణిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement