
న్యూఢిల్లీ: హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలపై ‘నోట్ల రద్దు’ నిర్ణయం తక్షణం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినట్లు ఒక సర్వేలో తెలింది. రూ.1,000, రూ.500 కరెన్సీ నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆన్‌లైన్ హోల్‌సేల్ మార్కెట్‌ప్లేస్ వైడర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల మొత్తంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉందని కూడా సర్వే వివరించింది. కొన్ని అంశాలను పరిశీలిస్తే...
►భారత్‌లోని హోల్‌సేలర్లు, రిటైలర్లలో దాదాపు 36 శాతం మంది నోట్ల రద్దు నిర్ణయం తమ వ్యాపారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు.
►2016 అక్టోబర్‌తో పోల్చితే 2017 అక్టోబర్‌లో తమ అమ్మకాలు 50 శాతానికి పైగా పడిపోయాయని సర్వేలో పాల్గొన్న వారిలో 21 శాతం మంది తెలిపారు. 20 నుంచి 50 శాతం వరకూ అమ్మకాలు పడిపోయాయని తెలియజేసిన వారి రేటు 27 శాతంగా ఉంది.
► మెజారిటీ వ్యాపారాల్లో నగదు ఆధారిత లావాదేవీలు తగ్గకపోవడం గమనార్హం. డీమోనిటైజేషన్ తరువాత ఇన్‌వాయిస్ రహిత నగదు అమ్మకాలు తగ్గినట్లు 40 శాతం మంది మాత్రమే సర్వేలో పేర్కొన్నారు.
►డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ బ్యాంక్ బదలాయింపుల విషయంలో డీమోనిటైజేషన్‌కు ముందు ‘జీరో’గా ఉన్న టెక్నాలజీ వినియోగం అటు తర్వాత కొంత పుంజుకుందని సర్వే వివరించింది.
►దేశవ్యాప్తంగా దుస్తులు, లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములైన రిటైలర్లు, హోల్‌సేలర్లు, తయారీదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రాతిపదికన తాజా సర్వే రూపొందింది.
►ఫ్యాషన్, హోమ్ డెకరేషన్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు వంటి విభాగాల్లో హోల్‌సేల్ మార్కెట్‌ప్లేస్‌గా ఉన్న వైడర్ ప్లాట్‌ఫామ్‌పై 7,500కుపైగా తయారీ, సరఫరాదారులు ఉన్నారు. దాదాపు 29 రాష్ట్రాల్లో 16,000 పిన్‌కోడ్‌లకు సంబంధించి 7 లక్షలకు పైగా రిటైలర్లకు వైడర్ తన సేవలను అందిస్తోంది.
ప్రత్యక్ష ప్రతికూల ప్రభావం...
డీమోనిటైజేషన్ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఈ ప్రభావం అమ్మకాలు పడిపోతున్న రూపంలో ప్రత్యక్ష రీతిన వ్యాపారాల్లో కనిపించింది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూల సెంటిమెంట్ కనిపించింది.
– దేవేశ్ రాయ్, పౌండర్ అండ్ సీఈఓ, వైడర్
Comments
Please login to add a commentAdd a comment