చమురు ఉత్పత్తి కోత.. మరో 9 నెలలు
ఒపెక్ దేశాల నిర్ణయం
న్యూఢిల్లీ: అధిక సరఫరా సమస్యను అధిగమించే దిశగా చమురు ఉత్పత్తిలో కోతను మరో తొమ్మిది నెలల పాటు కొనసాగించాలని క్రూడ్ ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్, ఇతర దేశాలు నిర్ణయించాయి. ఒపెక్‌లోని సభ్య దేశాలతో పాటు రష్యా తదితర దేశాలు కూడా మార్చి దాకా కోతలను పొడిగించేందుకు అంగీకరించినట్లు ఇరాన్ పెట్రోలియం శాఖ మంత్రి బిజాన్ నామ్‌దర్ జాంగ్నె వెల్లడించారు. ఉత్పత్తిని తగ్గించడం నుంచి నైజీరియా, లిబియాకు మినహాయింపు ఉంటుంది. అలాగే ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాన్ యథాపూర్వ ఉత్పత్తి స్థాయినే కొనసాగిస్తుందని బిజాన్ తెలియజేశారు.
ఒపెక్‌లో సభ్యత్వం లేని ఇతర దేశాలేవీ కొత్తగా ఈ ఒప్పందంలో చేరబోవడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. చమురు సరఫరా పెరిగిపోయి ధర భారీగా పతనమైన నేపథ్యంలో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత డిసెంబర్‌లో మరో 11 ఇతర దేశాలు కూడా ఈ డీల్‌లో భాగం కావడంతో మొత్తం ఉత్పత్తిలో కోత 1.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ఇది జనవరి నుంచి 6 నెలల పాటు అమల్లో ఉండాలి. దీనితో చమురు రేట్లు పెరిగినప్పటికీ.. అమెరికా నుంచి షేల్ గ్యాస్ ముంచెత్తడంతో నిల్వలు పెరిగి ధరల జోరు తగ్గింది.
అయితే మూడేళ్ల పాటు అధిక ఉత్పత్తి కారణంగా పేరుకుపోయిన నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయని, అయినప్పటికీ ఈ ఏడాది ఆఖరు నాటిదాకా ఖాళీ కావని ఒపెక్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఒపెక్‌తో పాటు ఇతర దేశాలు కూడా మార్చ్ దాకా ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఉత్పత్తి కోత మరింత పెరుగుతుందన్న అంచనాలకు భిన్నంగా యథాతథ స్థితిని కొనసాగించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించటంతో.. మార్కెట్ వర్గాలు ప్రతికూలంగా స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఒక దశలో 3.7 శాతం క్షీణించి 52.42 డాలర్ల వద్ద, నైమెక్స్ క్రూడ్ 4 శాతం తగ్గి 49.28 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.